ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రాష్ట్రంలో 2 వేల 742 కేంద్రాల్లో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమలు అమల్లో ఉన్నట్టు తెలిపారు. రాష్ట్ర రైతు సాధికార సంస్థ కార్య నిర్వాహక ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్తో కలిసి ప్రకృతి వ్యవసాయంపై ఆయన వీడియా కాన్ఫరెన్స్ చేశారు. వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్తో సహా 13 జిల్లాల వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్లు, ప్రకృతి వ్యవసాయ రైతులు, సంబంధిత అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇతర వ్యవసాయ పద్ధతుల కన్నా... ప్రకృతి వ్యవసాయంలో అధిక ఉత్పత్తులు, తక్కువ పెట్టుబడి, ఒత్తిడి లేని వ్యవసాయం చేయవచ్చని మంత్రి తెలిపారు. రసాయనాలను పూర్తిగా తగ్గించే దిశగా అడుగులు వేయాలని రైతులకు సూచించారు. పెట్టుబడి తగ్గించి, ఉత్పత్తుల నాణ్యతను పెంచడం తమ ప్రధాన లక్ష్యాలుగా ఉండాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను ఆయన విడుదల చేశారు.
2020-21 సంవత్సరానికి ఆర్.కే.వీ.వై, పీ.కే.వి.వై, కే.ఎఫ్.డబ్ల్యూ సహకారంతో 3 వేల 730 గ్రామపంచాయితీలలో నిరుపేద రైతులను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరంలో 50,000 మంది రైతులు... ప్రీ మాన్సూన్ డ్రైసోయింగ్ పద్ధతిని అమలు చేసే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.