కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా ఉందని జనసేన పార్టీ అభిప్రాయపడింది. కరోనా మహమ్మారితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కుదేలైన విపత్కర సమయంలో అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశంసించారు. బడ్జెట్లో ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 2 లక్షల 23 వేల కోట్లు రూపాయలు కేటాయించడం..,కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం రూ. 35 వేల కోట్లు ఇవ్వటం హర్షణీయమన్నారు. గ్రామీణ, జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో మౌలిక వసతులు పెంచడం, జాతీయ రహదారుల్లో ప్రమాదాలు జరిగితే వెంటనే వైద్యం అందేలా ట్రామా సెంటర్లు ఏర్పాటు వంటి నిర్ణయాల పట్ల అభినందనలు తెలిపారు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో విశాఖపట్నం ఓడరేవును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, చిత్తూరు నుంచి తమిళనాడుకు, విజయవాడ నుంచి ఖరగ్ పూర్ కు సరకు రవాణా కారిడార్ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. విపత్కర సమయంలో అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్‌ను తీసుకువచ్చిన ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు అభినందిస్తున్నామన్నారు.