Fake Certificates for Abroad Jobs : దిల్లీ పోలీసులు విజయవాడలో తనిఖీలు చేపట్టారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే విద్యార్థులకు నకిలీ పత్రాలు ఇచ్చి.. యూఎస్ ఎంబసీ అధికారులను మోసం చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే దీనికి మూలాలు మన రాష్ట్రంలోనే ఉన్నట్లు గుర్తించి..దిల్లీ పోలీసులు విజయవాడలోని కన్సల్టెంట్స్‌లో తనిఖీలు చేపట్టారు.
ప్రకాశం జిల్లా మాచవరానికి చెందిన ఒక అభ్యర్థి ఈ నెల 7న దిల్లీలోని యూఎస్ ఎంబసీలో స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తాను హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు అపాయింట్‌మెంట్ లెటర్‌తోపాటు గుంటూరులోని ఓ బ్యాంకు నుంచి రూ. 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరైనట్లు పత్రాలను ఎంబసీకి సమర్పించాడు. అయితే అభ్యర్థి సమర్పించినవన్నీ తప్పుడు పత్రాలని ఎంబసీ అధికారులు గుర్తించారు. దీనిపై ఎంబసీ అధికారులు మరింత లోతుగా ప్రశ్నించటంతో నకిలీ పత్రాల గుట్టు బయటపడింది. వాటిని విజయవాడలోని స్ప్రింగ్ ఫీల్డ్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్‌కు చెందిన ఏజెంట్ కేశవ సమకూర్చినట్లు అతడు తెలియజేశాడు. ఈ పత్రాల కోసం రూ. 26,500 చెల్లించినట్లు చెప్పాడు. దీనిపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కోసం మూడు రోజుల క్రితం విజయవాడకు వచ్చినట్లు తెలిసింది. ఇక్కడి కన్సల్టెంట్స్‌లో తనిఖీలు చేసినట్లు సమాచారం. కొన్ని కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఇదీ చదవండి : Kolleru Lake : కొల్లేరును మళ్లీ కొల్లగొట్టేస్తున్నారు!