కరోనా ఉద్ధృతి తగ్గటంతో సినిమా థియేటర్లలో వందశాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. కరోనా నిబంధనల మేరకు థియేటర్లలో మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది. ఇవాళ్టి నుంచే వందశాతం ఆక్యుపెన్సీ అమలు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో వెల్లడించింది.
సినిమా టికెట్ల ధరలపై త్వరలోనే నిర్ణయం..
రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలపై త్వరలోనే నిర్ణయం వస్తుందని.. ఇవాళ కమిటీ సమావేశం తర్వాత ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు అన్నారు. ప్రజలు, సినిమా పరిశ్రమ సంతృప్తి చెందేలా నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. మూడు స్లాబుల్లో టికెట్ల ధరలు ఉంటాయని.. ప్రేక్షకులు ఇబ్బందిపడే సమస్యలన్నీ తొలగిపోతాయని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.
"టికెట్ల ధరలు సహా అన్ని అంశాలూ చర్చించాం. కమిటీలో అధ్యయనం చేశాక ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. అనంతరం ప్రభుత్వం జీవోలు జారీ చేస్తుంది. టికెట్ల ధరల నిర్ణయానికి స్లాబులపై చర్చించాం. ధరలపై తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి.ప్రజలు, సినీ పరిశ్రమను సంతృప్తిపరిచేలా నిర్ణయాలుంటాయి. ధరలపై పది రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.సినీ ప్రముఖుల అభిప్రాయాలకు మా ఆలోచనలు దగ్గరగా ఉంటాయి. మేకింగ్ మని రూ.100 కోట్లు దాటితే స్పెషలైజ్డ్‌గా పరిగణించే అంశంపై చర్చిచాం. అలాగే థియేటర్లలో ఐదో షో పైనా సమావేశంలో చర్చించాం. ప్రదర్శనలకు సంబంధించి చిన్న సినిమాలకు ప్రాధాన్యత ఉంటుంది. కమిటీ సమావేశం మళ్లీ ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కానీ ప్రేక్షకులు ఇబ్బందిపడే సమస్యలన్నీ తొలగిపోతాయి. టికెట్ల ధరల నిర్ణయానికి థియేటర్లలో 3 స్లాబులు ఉంటాయి." - ముత్యాల రాందాస్ , తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్
ఇదీ చదవండి