రాజధాని అమరావతి ప్రణాళికలో గృహనిర్మాణ జోన్ అంశంపై అభ్యంతరాలు సమర్పించేందుకు హైకోర్టు ఈ నెల 20వరకు గడువిచ్చింది. అభ్యంతరాల్ని పరిగణనలో తీసుకోకుండా కొత్త నిబంధనలను ఖరారు చేయొద్దని సీఆర్డీఏ అధికారులకు స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. లాక్ డౌన్ కారణంగా ఆర్ - 5 జోన్ పై అభ్యంతరాలు సమర్పించేందుకు గడువును పొడిగించాలని కోరుతూ రైతు ఎ.నందకిశోర్ హైకోర్టులో పిల్ వేశారు.
దీనిపై మార్చి 24న విచారణ జరిపిన కోర్టు.. మొదట్లో 30 రోజులు గడువిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా ఆ ఉత్తర్వులను మే 20 వరకు పొడిగించింది. రాజధాని బృహత్ ప్రణాళిక ప్రకారం ఇప్పటి వరకు 4 నివాస జోన్లు ఉండేవి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అందుబాటు ధరల్లో గృహనిర్మాణ జోన్ - 5 ఏర్పాటు చేసేందుకు సీఆర్డీఏ నిర్ణయించింది. అందులో భాగంగా కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, జనవోలు గ్రామాల పరిధిలో 900 ఎకరాల్ని ఆర్ - 5జోన్ గా పేర్కొంది. ఈ వ్యవహారంపై మార్చి 10న గెజిట్ జారీ చేసి అభ్యంతరాలు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.
ఇదీ చూడండి మహా'లో కరోనా రికార్డు.. 24 గంటల్లో వెయ్యిమందికి పైగా వైరస్