కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్‌గజపతిరాజు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అశోక్ గజపతిరాజు ప్రోద్భలంతోనే మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారని ఈవో ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
మాన్సాస్ ట్రస్టు ఈవో వేతన ఖాతాలు నిలుపుదల చేయడం పట్ల గతనెల 17న విద్యాసంస్థల ఉద్యోగులు మాన్సాస్ ఛైర్మన్‌ను కలిశారు. అనంతరం ఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీతాలు ఎందుకు నిలిపివేశారంటూ ఈవోను నిలదీశారు. ఈక్రమంలో ఈవో, ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి.. కొవిడ్ నిబంధనల ఉల్లంఘన, ఈవోపై దాడికి ప్రేరేపించారనే ఆరోపణలతో అశోక్‌గజపతిరాజుపై విజయనగరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే.
డివిజన్ బెంచ్‌కు సంచైత
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా అశోక్ నియామకంపై సంచైత గజపతిరాజు హైకోర్టులో అప్పీల్ చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును వ్యతిరేకిస్తూ...డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేసింది. పిటిషన్ అనుమతిపై ఈ నెల 10న వాదనలు వింటామని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.
మాన్సాస్ వివాదం ఏంటంటే..
మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్‌గా సంచైత గజపతిరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. ఆమె నియామకం చెల్లదని స్పష్టం చేసింది. ట్రస్టు వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచైత గజపతిరాజు, ఊర్మిళ గజపతిరాజు, ఆర్‌వీ సునీత ప్రసాద్‌లను గుర్తిస్తూ ప్రభుత్వం ఇచ్చిన మరో జీవోనూ రద్దు చేసింది. సింహాచలం దేవస్థానం ఛైర్మన్‌గా సంచైత గజపతిరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన జీవోనూ హైకోర్టు కొట్టేసింది. మొత్తం నాలుగు జీవోలను (71, 72, 73, 74) రద్దు చేసింది.
కేంద్ర మాజీ మంత్రి, ట్రస్టు పూర్వ ఛైర్మన్ అశోక్‌గజపతిరాజును మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్‌గా, సింహాచలం దేవస్థానం వంశపారంపర్య ట్రస్టీ/ ఛైర్మన్‌గా పునరుద్ధరించింది. ఆయన నియామకాలకు సంబంధించి గతంలో జారీ చేసిన జీవోలను సమర్ధించింది. మాన్సాస్ ట్రస్టు.. ట్రస్టు డీడ్, ప్రాపర్టీ రిజిస్టర్ ప్రకారం 'కుటుంబంలో పెద్దవారయిన పురుషులు' వంశపారంపర్య ఛైర్మన్/అధ్యక్షులుగా వ్యవహరించాలని స్పష్టంగా ఉందని, అందువల్ల అశోక్‌గజపతిరాజే ట్రస్టు ఛైర్మన్‌గా ఉండాలని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో ఏకీభవించిన హైకోర్టు సంచైత నియామకాన్ని రద్దు చేస్తూ అశోక్‌గజపతిరాజు నియామకాన్ని పునరుద్ధరించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.వెంకటరమణ ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు. అశోక్‌గజపతిరాజు దాఖలు చేసిన మూడు వ్యాజ్యాలను అనుమతిచ్చారు. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా అశోక్ నియామకంపై సింగిల్ బెంచ్ తీర్పును వ్యతిరేకిస్తూ...సంచైత డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేసింది.
సంబంధిత కథనాలు
Mansas Trust: సంచైత నియామకం చెల్లదు: హైకోర్టు కీలక తీర్పు!
Mansas Trust: మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా ప్రథమ ప్రాధాన్యత విద్యకే: అశోక్ గజపతిరాజు