రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థలను (Aided Educational Institutions) ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ జారీ చేసిన జీవోను (G.O) సవాల్ చేస్తూ విద్యాసంస్థల అసోసియేషన్లు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు(AP High Court) విచారణ జరిపింది. విచారణలో భాగంగా ప్రభుత్వంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిడెడ్ విద్యాసంస్థల అంగీకారాన్ని బలవంతంగా తీసుకుంటున్నారని పిటిషనర్ (Petitioner) తరఫు న్యాయవాది ఎన్.సుబ్బారావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అధికారులకు కడప డీఈవో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను పిటిషనర్ ధర్మాసనం ముందు ప్రవేశపెట్టారు. విచారణలో భాగంగా పిటిషనర్ ప్రొసీడింగ్స్ (Petitioner Proceedings) ను ప్రధాన న్యాయమూర్తి చదివి వినిపించారు.
ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే విషయం స్పష్టమవుతోందని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వంలోకి తీసుకొనేందుకు అంగీకరించిన విద్యాసంస్థల నుంచి మాత్రమే అంగీకారపు పత్రాలు (Acceptance Documents) తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మరో విధంగా జరగుతున్నట్లు తెలుస్తోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. ఈ నెల 29న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (Director of School Education) ధర్మాసనం ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణ 29వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చదవండి