పక్క వాళ్లను పట్టించుకోని ఈ రోజుల్లో జంతువులను ప్రేమిస్తూ... వాటి ఆలనా పాలనా చూసుకుంటున్నారు విజయవాడకు చెందిన మురాల వెంకటేశ్వర్లు. జీవ కారుణ్యం పేరుతో ఓ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. విరాళాలు సేకరించి మరీ నీటి తొట్టెలు ఏర్పాటు చేసి జంతువుల దాహార్తి తీరుస్తున్నారు.
మురాల వెంకటేశ్వర్లకు జంతువులంటే ఎనలేని ప్రేమ. నోరులేని మూగ జీవాలు ఎక్కడ కనిపించినా చేరదీసి ఆదరించడం ఈయన నైజం. పదిహేనేళ్ల క్రితం జీవకారుణ్య సంస్థ ఏర్పాటు చేసి జంతువుల ఆలన చూస్తున్నారు. వేసవిలో మూగజీవాలు నీటి కోసం పడుతున్న ఇబ్బందులు గమనించి ఏదో ఒకటి చేయాలని తపించిపోయారు. అలా ఆరేళ్ల క్రితం నీళ్లందించే కార్యక్రమం మెుదలుపెట్టారు.
పొద్దున్నుంచి..సాయంత్రం వరకూ!
విజయవాడ భవానీపురం రైల్వే యార్డు పక్కనున్న జీవ కారుణ్య ఆశ్రమం నుంచి నిత్యం ఆటోలో నీళ్లు తీసుకెళ్లి మూగజీవాలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో తొట్టెలు ఉంచుతారు వెంకటేశ్వర్లు. ఉదయం 7.30 గంటలకు నీళ్ల ట్యాంకుతో బయలుదేరే వెంకటేశ్వర్లు సాయంత్రం 4 గంటల వరకు జంతువుల గొంతు తడుపుతున్నారు. ఇలా రోజుకు మూడు ట్యాంకుల నీటిని అందిస్తున్నారు.
మారిన స్థానికులు
ప్రారంభంలో జంతువుల కోసం పెట్టిన నీటి తొట్టెలను...చుట్టుపక్కల వారు ఎత్తుకెళ్లిపోయేవారు. వాహనాలు తగిలి పగిలిపోయిన సందర్భాలూ అనేకం. అయినా వెనకడుగు వేయకుండా నీళ్లు అందిస్తూ వస్తున్నారు. స్థానికుల్లోనూ అవగాహన కలిగి నీటి తొట్టెలు సంరక్షించడం ప్రారంభించారు.
సాయం కోసం..!
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా...ఏడాదికి లక్షా 50 రూపాయలు ఖర్చు చేసి మూగజీవాల దాహం తీరుస్తున్నారు. ఓ వైపు స్వచ్ఛంద సంస్థలు, స్నేహితులు, ప్రజల నుంచి విరాళాలు సేకరించి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. నిధుల కొరత కారణంగా ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోనే నీటితొట్టెలు ఏర్పాటు చేశారు. దాతలు ముందుకొస్తే ఈ కార్యక్రమాన్ని విస్తరించి నగరవ్యాప్తంగా చేయాలనేది ఆలోచనలో ఉన్నారు వెంకటేశ్వర్లు.