రాష్ట్ర విభజన అనంతరం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్న విజయవాడ నగరంలో చెత్త నిర్వహణ తలకుమించిన భారంగా మారుతోంది. ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్ అంటూ నగరంలోని 40 డివిజన్లలో ఈ విధానం అమల్లో ఉంది. ఇందుకోసం ఎన్ని పథకాలు అమలుచేస్తున్నా ఫలితం శూన్యం. ప్రణాళికా లోపం, పౌరస్పృహ లేకపోవడమే ఇందుకు కారణం. అందుకే నగర పాలక సంస్థ అధికారులు జనం సహకారంతో పరిష్కారం ఆలోచించారు.
కంపోస్టుగా తయారు చేసుకోవాలి
అపార్టుమెంట్లు, హోటళ్ల నిర్వాహకులకు విజ్ఞప్తి చేసి వదిలేయకుండా....కచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ-2016 చట్టం ప్రకారం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని ఇళ్ల నుంచి వచ్చే చెత్తను తడి, పొడి చెత్తగా వారి ఇళ్ల దగ్గరే విభజించి నగరపాలక సిబ్బందికి అందజేయాలి. అలాగే 20 ప్లాట్లకు పైబడిన అపార్టుమెంట్ నిర్వాహకులు రోజూ వారీ చెత్తను తడి, పొడిగా విభజించి తడి చెత్తను కంపోస్టు ఎరువుగా తయారు చేసుకోవాల్సిన బాధ్యత వారిదే. నగర పరిధిలో ఉన్న 100 కేజీలు పైబడి చెత్తను ఉత్పత్తి చేసే హోటళ్లు, కల్యాణ మండపాలు, విద్యా, వ్యాపార సంస్థలు ఇలా ఎక్కువ మొత్తంలో చెత్తను ఉత్పత్తి చేసే వారు కచ్చితంగా తడి చెత్తను కంపోస్టు ఎరువుగా తయారు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
సవాలు అదిగమించాలంటే
నగరంలో నిత్యం 550 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా....అందులో దాదాపు 200 టన్నుల తడి చెత్త కాగా, మిగిలినది పొడి చెత్త. సేకరణ నగర పాలక సంస్థకు సవాలుగా మారింది. పెద్ద ఎత్తున సిబ్బందిని విధుల్లో ఉంచినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఇలా నగరంలోని చెత్త మొత్తం డంపింగ్ యార్డులకు పోతోంది. చెత్తను రీసైకిల్ చేసే విధానం లేకపోవడంతో నగరం నుంచి తీసుకెళ్లిన చెత్త కొండలా పేరుకుపోతోంది.
నగర వాసులు తడి, పొడి చెత్తను వారి ఇంటి వద్దే వేరు చేసి సిబ్బందికి ఇవ్వడం ద్వారా నగర పాలక సంస్థకు చెత్త నిర్వహణ సులభతరం కానుంది. ముఖ్యంగా ఎవరికి వారు తమ ఇంటి వద్దే తడి చెత్తను ఎరువుగా మార్చి వాడుకుంటే...కాస్తలో కాస్త చెత్త ఉత్పత్తి తగ్గుతుంది.