మహారాష్ట్రలోని విదర్భతో పాటు.. పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. గుంటూరులో జోరు వానకు రోడ్లపై మురుగుపారి వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. నగరంలో అనేక చోట్ల కాలనీలు నీటమునిగాయి. ఇళ్ల నుంచి కార్యాలయాలు, వ్యాపార సముదాయాలకు వెళ్లేందుకు జనం ఇబ్బందిపడ్డారు.
ప్రధానంగా గుంటూరు జిల్లాలోని.. తెనాలి, చిలకలూరిపేట, నరసరావుపేట, బాపట్ల, కర్లపాలెం, పెదనందిపాడు, కాకుమాను, వట్టిచెరుకూరు, అమరావతి, గురజాల, పిడుగురాళ్ల, అమృతలూరు మండలాల్లో వర్షం కుండపోతగా కురిసింది. ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు ఎస్సీ కాలనీలో తాటిచెట్టుపై పిడుగుపడింది. తాడేపల్లి డోలాస్ నగర్‌లో ఇళ్లల్లోకి నీరు చేరింది. మంగళగిరిలోని శ్రీరామ్ కాలనీ జలమయమైంది. పీఎంఏవై ఇళ్లను నీరు చుట్టుముట్టింది. ఎన్నారై ఆస్పత్రి మార్గంలో డ్రైనేజీలు పొంగడంతో రోగులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
విజయవాడ నగరంలో వర్షం ఏకబిగిన కురిసింది. బెంజిసర్కిల్, పటమట, ఆటోనగర్, కానూరు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మొగల్రాజపురం, చుట్టుగుంట, భవానీపురం, వన్‌టౌన్ ప్రాంతాల్లోని కాలనీల చుట్టూ నీరు నిలిచింది.
కృష్ణా జిల్లా గన్నవరం, కంకిపాడు, తోట్లవల్లూరు, పెనమలూరు మండలాల్లోనూ ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో.. రైతులు, ఉద్యోగులు ఇబ్బందిపడ్డారు. కేసరపల్లి, గౌడ పేట, సావరగూడెం రోడ్లపై నీరు పారింది. గొల్లనపల్లి వద్ద పోలవరం కాలువపై గుంతల్లోకి నీరు చేరింది. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, నాగాయలంక, కోడూరు మండలాల్లో వరి చేలు నీట మునిగాయి. ప్రకాశం జిల్లా చీరాలలో వర్షం పడింది. ఈపురుపాలెం, వేటపాలెం ప్రాంతాల్లోనూ.. భారీ వర్షానికి పంట పొలాలు నీట మునిగాయి.
ఇదీ చదవండి:
AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 1,217 కరోనా కేసులు, 13 మరణాలు!