అఖిల భారత 20వ పోలీసు బ్యాండ్ పోటీలకు తెలంగాణలోని సికింద్రాబాద్ వేదికైంది. ఈ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్... పోటీలను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలకు చెందిన పోలీసు బ్యాండ్ సిబ్బంది ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. అసోం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఝార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నాగాలాండ్, పంజాబ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఆర్పీఎఫ్ విభాగాలు పోటీల్లో పాల్గొంటున్నాయి.
పోలీసు బ్యాండ్ సిబ్బంది కీలకమైన విధులు నిర్వర్తిస్తున్నారని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఈ తరహా పోటీల ద్వారా పోలీసు సిబ్బంది ప్రతిభాపాటవాలు వెలికితీయవచ్చని గవర్నర్ అభిప్రాయపడ్డారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 22 రాష్ట్రాల నుంచి 1300 మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 23న జరగనున్న ముగింపు కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ సి అంగాడి హాజరుకానున్నారు.