గ్లోబల్ టీచర్-2020 అవార్డు గ్రహీత రంజిత్ సిన్హ్‌తో.. కేంద్ర విద్యాశాఖకు చెందిన మహాత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ (ఎంజీఎన్‌సీఆర్‌ఈ), విజయవాడ గుణదలలోని అభ్యాస విద్యాలయం పాఠశాల.. సంయుక్తంగా ముఖాముఖి నిర్వహించాయి. ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంజీఎన్‌సీఆర్‌ఈ ఛైర్మన్ డాక్టర్ ప్రసన్నకుమార్, అభ్యాస విద్యాలయం ప్రిన్సిపల్ వై.వి.కృష్ణ, దేశవ్యాప్తంగా పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు అడిగిన పలు ప్రశ్నలకు రంజిత్ సిన్హ్ దిశాలే సమాధానాలు ఇచ్చారు. విద్యార్థులు.. ఇష్టపడి నేర్చుకునేలా బోధన ఉండాలని సూచించారు. ప్రస్తుత విద్యావిధానంలో చేపట్టాల్సిన మార్పులు, సృజనాత్మక పద్ధతుల్లో బోధన వంటి విషయాలు వివరించారు.
విద్యార్థులకు బోధించింది ప్రాక్టికల్‌గా చూపించాలి
నేటి విద్యార్థులకు అవకాశాలకు, సమాచార సేకరణకు కొదవ లేదని.. విద్యార్థులు తమ ఆసక్తి ఏంటనేది ముందుగా తెలుసుకోవడం అన్నింటికంటే ముఖ్యమని రంజిత్ సిన్హ్ పేర్కొన్నారు. ప్రతి విషయంలో విద్యార్థులకు అర్థమయ్యే పద్ధతిలో చేసి వివరిస్తే.. చురుకుగా నేర్చుకుంటారని చెప్పారు. పాఠాలు పూర్తిచేయాలనే పంథాలో కాకుండా.. వాటి ద్వారా విద్యార్థులు ఏం నేర్చుకుంటున్నారు, ఏం నేర్పిస్తున్నాం.. అని చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. తరగతి గదిలో నాలుగు గోడల మధ్య కూర్చోబెట్టి బోధిస్తే ఇన్నోవేటర్స్, క్రియేటర్స్ తయారవ్వడం కష్టమని అన్నారు. తరగతి గదిలో నేర్చుకున్నది ఆచరణలో ఎలా పెట్టాలో తెలిపితే.. విద్యార్థులు ప్రగతి సాధిస్తారని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
కోడింగ్ నైపుణ్యం ఉంటే బీటెక్ విద్యార్థులకు కంపెనీల బ్రహ్మరథం