చదువు అందరి జీవితాల్లో వెలుగును నింపే సాధనమని.. గ్లోబల్ టీచర్ - 2020 అవార్డు గ్రహీత రంజిత్ సిన్హ్ దిశాలే అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయులు పోటీపడిన ప్రతిష్ఠాత్మకమైన గ్లోబల్ టీచర్ అవార్డు, రూ.7.2కోట్ల నగదు బహుమతిని రంజిత్ సిన్హ్ గెలుచుకున్నారు. ఆయనతో మహాత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్(ఎంజీఎన్‌సీఆర్‌ఈ), విజయవాడ గుణదలలోని అభ్యాస విద్యాలయం పాఠశాలలు సంయుక్తంగా ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంజీఎన్‌సీఆర్‌ఈ ఛైర్మన్ డాక్టర్ డబ్ల్యుూ.జీ.ప్రసన్నకుమార్, అభ్యాస విద్యాలయం ప్రిన్సిపాల్ వై.వీ.కృష్ణ, దేశవ్యాప్తంగా పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థులు..ఇష్టపడి నేర్చుకునేలా విద్యాబోధన ఉండాలని రంజిత్ సిన్హ్ దిశాలే సూచించారు. ప్రస్తుత విద్యావిధానంలో చేపట్టాల్సిన మార్పులు, విద్యార్థులకు సృజనాత్మక పద్ధతుల్లో బోధన వంటి పలు విషయాలను ఆయన వివరించారు. ఉపాధ్యాయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ప్ర: ప్రస్తుతం ఎలాంటి విద్యా విధానం అవసరం ?
రంజిత్: గాంధీజీ చెప్పిన అనుభవ పూర్వక విద్యా విధానం ఇప్పటికీ..ఎప్పటికీ అనుసరణీయమైనది. విద్యార్థులు సొంత అనుభవాల ద్వారా మెరుగ్గా నేర్చుకుంటారు. నీటి వినియోగం, పొదుపు.. లాంటివి చెబితేనో, చదివితేనే పెద్దగా అర్థం కావు. కానీ..వాటిని ప్రాక్టికల్‌గా చేసి చూపించడం, ప్రతిరోజు ఇళ్లలో ఎంత నీరు వినియోగిస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారనేది లెక్కలు కట్టించడం ద్వారా బాగా అర్థమవుతాయి. ఇలాగే ప్రతి విషయంలోనూ విద్యార్థులకు అర్థమయ్యే పద్ధతిలో చేసి చూపించి వివరిస్తే..చురుగ్గా నేర్చుకుంటారు.
ప్ర: పాఠ్య పుస్తకాల్లో ఉన్న సిలబస్‌ను సృజనాత్మకంగా, విద్యార్థులకు మరింత ఆసక్తిని నింపేలా బోధిస్తూ అందరూ రంజిత్ సిన్హ్ దిశాలేలా అవ్వాలంటే ఏం చేయాలి.?
రంజిత్: అందరూ రంజిత్ దిశాలేలా అవ్వాలనే ప్రయత్నం చేయవద్దు. దిశాలేను ఒక వ్యక్తిగా కాకుండా..ఒక ఆలోచనలా చూడాలి. ప్రతి విద్యార్థి ఒక ప్రత్యేకమైనట్టే..ప్రతి ఉపాధ్యాయుడు, పాఠశాల అంతే ప్రత్యేకం. పరిస్థితులు, అవసరాలు ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే.. పాఠాలు పూర్తిచేయాలనే పంథాలో కాకుండా..వాటి ద్వారా విద్యార్థులు ఏం నేర్చుకుంటున్నారు, ఏం నేర్పిస్తున్నాం.. అని చూడాలి. యాంత్రికంగా కాకుండా..ప్రత్యేకంగా, విభిన్నంగా ఎలా బోధించగలమని ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ మార్పు తీసుకురాగలరు.
ప్ర: మీకు స్ఫూర్తినిచ్చిన ఉపాధ్యాయుడు ఎవరు? ఎందుకు ?
రంజిత్: రాజేంద్రమానే అనే ఉపాధ్యాయుడు నాకు స్ఫూర్తినిచ్చారు. ఆయన వద్ద ఆరు నెలలు నేను అసిస్టెంట్ టీచర్‌గా పనిచేశాను. ఆయన ప్రభావం నాపై చాలా ఎక్కువ ఉంది. ఒకే తరగతిలో విభిన్న స్థాయిల్లో ఉండే పిల్లలతో ఎలా మెలగాలి, ఎలా నేర్పించాలి, వారి భావోద్వేగాలను ఎలా అర్థం చేసుకోవాలి, పిల్లలకు స్నేహితుడిగా ఎలా ఉండాలి లాంటి అనేక విషయాలను రాజేంద్రమానే వద్ద నేను నేర్చుకున్నాను. అవి నాకు ఉపాధ్యాయుడిగా ఎంతో ఉపయోగపడ్డాయి.
ప్ర: ప్రస్తుత విద్యావిధానంలో మార్పులు తీసుకురావటం సవాళ్లతో కూడుకున్నది. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మీరు ఎలా అధిగమించగలిగారు ?
రంజిత్: ప్రతికూల పరిస్థితులు, సవాళ్లు, సమస్యలే నాకు ప్రేరణ. ఆ ప్రేరణతోనే మార్పు తీసుకురావాలని ప్రయత్నం ఆరంభించాను. అన్నీ అనుకూలించినప్పుడు సాధించిన విజయాలు అంత ఆనందం ఇవ్వవు. సమస్యలు, సవాళ్ల మధ్య సాధించినప్పుడే ఎంతో గొప్పగా ఉంటాయి. ఉపాధ్యాయుడిని కాకముందు ఇంత పట్టుదల నాలో లేదు. కానీ.. నాకు ఉపాధ్యాయుడిగా శిక్షణ ఇచ్చిన గురువులు నన్ను ఇలా తీర్చిదిద్దారు. వారికి ఎంతో రుణపడి ఉన్నాను.
ప్ర: మీ ప్రాంతంలో బాల్య వివాహాలు పూర్తిగా ఎలా ఆపగలిగారు ? అక్కడి ప్రజల్లో ఎలా మార్పు తీసుకురాగలిగారు ?
రంజిత్: మనం ఒక సమస్యను పరిష్కరించాలన్నా..,మార్పు తీసుకురావాలన్నా.., అక్కడ జరుగుతున్న దానిని తప్పు అని ఎత్తిచూపితే ప్రయోజనం ఉండదు. అలాచేస్తే సమస్యను పరిష్కరించటం మరింత కష్టమవుతుంది. అందుకే.. ముందుగా వారిలో ఒకడిగా కలిసిపోయాను. కలిసి పనిచేశాను. భోజనం చేశాను. కష్టసుఖాలు పంచుకున్నాను. వారి వేడుకల్లో పాల్గొన్నాను. ఆ తర్వాత సందర్భం వచ్చినప్పుడు..బాల్య వివాహాలపై ఆలోచన రేకెత్తించేవాడిని. ఇలా కాకుండా వేరేలా చేస్తే బాగుంటుందని చెప్పేవాడిని. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బాగా చదువుకున్న అమ్మాయిలను పిలిపించి వారితో మాట్లాడించే వాడిని. వారు ఏం ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంత సంపాదిస్తున్నారు. సమాజంలో ఎంత గౌరవం ఉంది. ఇలాంటివన్నీ వివరించేవాడిని. అప్పుడే తల్లిదండ్రుల్లో మార్పు ఆరంభమైంది. పిల్లలను చదివించడం ఆరంభించారు.
ప్ర: ఈతరం విద్యార్థులు ఎలా ఉండాలి ?
రంజిత్: ఇది సాంకేతిక యుగం. నేటి విద్యార్థులకు అవకాశాలకు, సమాచార సేకరణకు కొదువ లేదు. విద్యార్థులు తమ ఆసక్తి ఏంటనేది ముందుగా తెలుసుకోవడం అన్నింటికంటే ముఖ్యం. ఆ తర్వాత వారి ఆసక్తికి అనుగుణంగా.. ఆ రంగంలో ఉన్న నిష్ణాతుల గురించి తెలుసుకోవాలి. వారి ద్వారా తాము అనుకున్నది సాధించేందుకు మార్గం సుగమం చేసుకోవాలి. గూగుల్, యూట్యూబ్‌లోనూ విద్యార్థులు ఆసక్తి ఉన్న రంగంలో పరిజ్ఞానం సాధించేందుకు కావాల్సినంత సమాచారం ఉంది.
ప్ర: నేటి విద్యా విధానంలో ప్రధానమైన లోపం ఏంటి ?
రంజిత్: ప్రస్తుతం సమాజానికి కొత్తగా ఆలోచించేవాళ్లు, అవకాశాలను సృష్టించేవాళ్లు కావాలి. కానీ..నేటి విద్యావిధానం దీనికి సహకరించటం లేదు. తరగతి గదిలో నాలుగు గోడల మధ్య కూర్చోబెట్టి బోధిస్తే ఇన్నోవేటర్స్, క్రియేటర్స్ తయారవ్వటం కష్టం. సమయం, ఆలోచనలపై ఆంక్షలు లేని స్వేచ్ఛాయుత విద్యావిధానం ప్రస్తుతం అవసరమని అందరం గుర్తించాల్సిన సమయం ఇది. తరగతి గదిలో నేర్చుకున్నది ఆచరణలో ఎలా చూపాలో నేర్పించాలి. పిల్లల్ని వినియోగదారులుగా చూసినంతకాలం ఇది సాధ్యం కాదు. వారి సొంత ఆలోచనలకు పదును పెట్టే విద్యావిధానం అవసరం. కానీ.. తరగతి గదిలో తాము చెప్పిందే చేయాలనేలా విద్య సాగుతోంది.
ప్ర: స్మార్ట్‌ఫోన్ చెడు ప్రభావం నుంచి పిల్లలను ఎలా బయటపడేయాలి ?
రంజిత్: పిల్లలకు ఏది మంచి, ఏది చెడు అని చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. వాళ్లంతట వాళ్లు తెలుసుకునేలా చేయాలి. పిల్లలు మొబైల్ ఫోన్‌ను నేర్చుకునేందుకు ఓ సాధనంగా వినియోగించాలి. పరిజ్ఞాన సేకరణకు ఓ చక్కని మార్గమనే విషయం వారికి తెలియజేయాలి. స్మార్ట్‌ఫోన్ అనేది ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఓ వేదిక అనే భావన తొలగించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
ఇదీచదవండి: బహుమతి పేరిట భారీ మోసం.. రూ.2.90 లక్షలకు కుచ్చుటోపి !