Gannavaram Airport Land Victims Concern: గన్నవరం ఎయిర్ పోర్టుకు భూములిచ్చిన యజమానులు రోడ్డునపడ్డారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఆరేళ్ల క్రితం భూములు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పటివరకు తమ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరరకు జిల్లా కలెక్టరేట్లో జేసీని కలిసి వినతిపత్రం అందజేశారు.
గన్నవరం విమానాశ్రయం సమీపంలోని సుమారు 500 మందిపైగా ప్లాట్ల యజమానులు.. మూడు వెంచర్లలో ప్లాట్లు వేసుకున్నారు. ఆరేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం విమానాశ్రయ విస్తీర్ణం కోసం ఆ ప్లాట్లను స్వాధీనం చేసుకుంది. భూములు తీసుకుని మరోచోట భూములు ఇస్తామని ప్లాట్ల యజమానులకు హామీ ఇచ్చింది. దీంతో ఆ స్థలంలో విమానాశ్రయం అధికారులు గోడలు కట్టేశారు. ప్రభుత్వం పనులు ప్రారంభించింది.
ఇప్పటికి ఆరేళ్లు..
అయితే.. ఇప్పటివరకు వారికి ఇస్తామన్న స్థలాలు కేటాయించలేదు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. 2013 యాక్విజేషన్ యాక్ట్ ప్రకారం మీడియేషన్ ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందని బాధితులు చెబుతున్నారు. కోర్టు ఆదేశాలను అధికారులు పట్టించుకోవట్లేదని బాధితులు కోర్టు ధిక్కారం కింద హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయినా.. ఇప్పటివరకు ప్రభుత్వం తమ సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టలేదని కన్నీరుమున్నీరవుతున్నారు.
వడ్డీలు కట్టలేకపోతున్నాం..
అప్పులు తెచ్చి ప్లాట్లు కొన్నామని.. వాటికి వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వంశీ ఆధ్వర్యంలో జెసీ మాధవీలతను కలిసి తమ సమస్యలను విన్నవించారు. తమ ప్లాట్లు తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి..COUNSELING 3rd Phase: విద్యార్థులారా ఇది మీకే.. రేపటి నుంచే మూడో విడత కౌన్సెలింగ్