Fuel Prices: పెట్రోలు, డీజిల్ అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వ పన్నుల్లో పైసా తగ్గించడం లేదు. దీంతో దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలోనే వాటి ధరలు అధికంగా ఉన్నాయి. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం గతేడాది నవంబరులో ఒకసారి తగ్గించినప్పుడు రాష్ట్రంలో తగ్గించలేదు. ఈ నెల 22న కేంద్రం రెండో విడతగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో వివిధ రాష్ట్రాల్లో లీటరు పెట్రోలు ధర రూ.9-10, డీజిల్ ధర రూ.7-8 లోపు తగ్గింది.
రాష్ట్రం తమ పన్నుల్ని తగ్గించుకుంటే.. ఇంధన భారం నుంచి ఉపశమనం లభిస్తుందని అనుకున్నారు. అయితే ఆ దిశగా చర్యలేమీ లేవు. ఏపీతో పోలిస్తే లీటరుకు రూ.10-12 వరకు తక్కువ కావడంతో వినియోగదారులు పక్క రాష్ట్రాల పరిధిలోని బంకులకు పోతున్నారని కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డీజిల్ రూ.100 పైనే.. ఎక్సైజ్ సుంకం తగ్గించాక దేశంలో చాలాచోట్ల డీజిల్ ధరలు రూ.100 లోపునకు చేరాయి. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా రూ.100పైనే ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా కుప్పంలో లీటరు పెట్రోలు రూ.114.10, డీజిల్ రూ.101.57 చొప్పున ఉన్నాయి. అనంతపురం జిల్లా మడకశిర, పరిగి ప్రాంతాల్లోనూ పెట్రోలు రూ.112పైన, డీజిల్ రూ.100పైన ఉన్నాయి. పల్నాడు, శ్రీకాకుళం జిల్లాల్లోనూ పలుచోట్ల ఇవే ధరలున్నాయి.
మూతపడుతున్న సరిహద్దు బంకులు.. కర్ణాటకతో పోలిస్తే మన రాష్ట్రంలో లీటరుకు పెట్రోలు, డీజిల్‌పై రూ.10 చొప్పున అధికంగా ఉంది. ఉదాహరణకు కర్ణాటకలోని కోలార్ జిల్లా తాడిగల్‌లో లీటరు పెట్రోలు ధర రూ.102.05, డీజిల్ రూ.87.99 ఉండగా, అక్కడకు సమీపంలోని అనంతపురం జిల్లా బి.కొత్తకోటలో లీటరు పెట్రోలు రూ.111.99, డీజిల్ రూ.99.70 ఉన్నాయి. అంటే డీజిల్‌పై లీటరుకు రూ.11.71, పెట్రోలుపై రూ.9.94 అధికంగా ఉన్నాయని వివరిస్తున్నారు. ఫలితంగా సరిహద్దు ప్రాంతాల్లోని వినియోగదారులు కర్ణాటక బంకులకు తరలివెళ్తున్నారు.
గతంతో పోలిస్తే ఆ రాష్ట్రంలోని బంకుల్లో అమ్మకాలు 5 రెట్లు పెరిగినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర పరిధిలోని బంకులు మూతపడుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని చిలమత్తూరు, రొద్దం, మడకశిర, అమరాపురం, అనంతపురం జిల్లాలోని డి.హీరేహాళ్, బొమ్మనహాళ్ తదితర మండలాల పరిధిలో ఇప్పటికే 60 బంకుల్ని మూసేశారు. అమ్మకాలు పడిపోవడమే దీనికి ప్రధాన కారణం.
వాహనదారులే కాకుండా.. అధిక మొత్తంలో డీజిల్ వినియోగించేవారు కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోనే ఇంధనం కొంటున్నారు. లారీలు, పొక్లెయిన్లు, ప్రైవేటు బస్సులు, ట్రాక్టర్లకు అక్కడే ఇంధనం పోయిస్తున్నారు. అవసరం మేరకు డ్రమ్ముల్లోనూ తెచ్చుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని బంకులు మూతపడతాయన్న ఆందోళన డీలర్లలో వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: