కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్డౌన్ అమలుచేసిన ప్రభుత్వం.... ఇళ్లకే పరిమితమైన పేదలకు నేటి నుంచి నిత్యావసరాలను ఇవ్వనుంది. ఇందుకు పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పును పంపిణీ చేయనుంది. ఇదే తరహాలో ఏప్రిల్ 15న ఓసారి, 29న మరోసారీ ఉచిత రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రతా పథకంలో లేని కార్డుదారులకు కూడా ఈ సాయాన్ని అందించాలని నిర్ణయించింది. దీనికి అదనంగా ఏప్రిల్ 4వ తేదీన వెయ్యి రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా వాలంటీర్ల ద్వారా అందించనున్నారు.
కరోనా నేపథ్యంలో చౌకధరల దుకాణాల వద్ద ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలని సీఎం తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం 1 గంట వరకూ దుకాణాలు తెరిచే ఉంటాయని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు. ఎవరూ తొందరపడొద్దని సూచించారు. బయోమెట్రిక్ లేకుండానే సరకులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
జిల్లాల్లో కూడా ఏర్పాట్లపై కలెక్టర్లు సమీక్షలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో దుకాణాల వద్ద సామాజిక దూరాన్ని పాటించేలా అధికారులకు సూచనలు చేశారు.
ఏప్రిల్ 1 తేదీనే పింఛన్లను పంపిణీ కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారులందరికీ ఇంటికే తీసుకెళ్లి అందించాలన్నారు. పంపిణీలో బయోమెట్రిక్ విధానానికి స్వస్తిపలకాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రానికి వస్తున్న వారికి సరిహద్దుల్లోనే వసతి