హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వానతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. ఎల్బీనగర్, పనామా, సుష్మా, ఆటోనగర్, హయత్‌నగర్, పెద్దఅంబర్‌పేటలో భారీ వర్షం కారణంగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి వద్ద జాతీయ రహదారి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సుమారు 3 కి.మీ మేర రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇనాంగూడ వద్ద జాతీయ రహదారిపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరదలతో కార్లు, ఇతర వాహనాలు నీటమునిగాయి.
చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. చెట్లు విరిగి పడడం వల్ల పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని విజ్ఞప్తి చేసింది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక