New Medical Colleges: రాష్ట్రంలో ఐదు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులు బోధనాసుపత్రులుగా మారనున్నాయి. ఏలూరు, విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, నంద్యాలలోని జిల్లా ఆసుపత్రులను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఈ ఆసుపత్రుల్లో నిర్మాణాలు చేపట్టేందుకు 146 కోట్లు వెచ్చించనున్నారు. బోధనాసుపత్రుల స్థాయికి చేర్చేందుకు అదనపు నిర్మాణాల కోసం 5 కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయించింది.
లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు లెక్చర్ హాళ్లు, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ బ్లాకులు నిర్మించనున్నారు. రాజమహేంద్రవరం, ఏలూరు ఆసుపత్రుల పక్కనే ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. మిగిలినచోట్ల ఎంపిక చేసిన స్థలాల్లో భవనాలు నిర్మిస్తారు. విజయనగరం, రాజమహేంద్రవరంలలో వైద్య కళాశాలల భవనాల నిర్మాణానికి 35 కోట్ల చొప్పున, ఏలూరు, నంద్యాలలో 38 కోట్ల చొప్పున వెచ్చించనున్నారు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక సాయం కింద 111 కోట్లు పొందేందుకూ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఒక్కో ఆసుపత్రిలో 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపునకు జాతీయ వైద్య కమిషన్‌కు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ దరఖాస్తు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం 16 చోట్ల కొత్తగా వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్మాణాల కోసం టెండర్లు ఆహ్వానించి సంస్థలను ఎంపిక చేసింది. 5 మినహా మిగిలిన 11 చోట్ల జాప్యమవుతోంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలు ఇప్పట్లో చేపట్టే పరిస్థితి లేదు.
ఇవీ చదవండి: