గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం మొక్కపాడులో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అధికార పార్టీ మద్దతుదారుని తరపున వాలంటీర్ల ప్రచారం చేస్తుండంతో తెదేపా వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రెండు వర్గాల వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కృష్ణా జిల్లా కలిదిండి మండలం గురవయ్యపాలెంలో....ఆర్వో ఓ వర్గానికి కొమ్ముకాస్తున్నారంటూ కొందరు ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశారు. ఏ కారణం చూపకుండా 24 మంది అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించినట్లు..ఎస్‌ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రత్యర్థులతో అవగాహకు వచ్చే తమ నామినేషన్లను తిరస్కరించారని వారు ఆరోపించారు.
తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం యస్.అగ్రహారం సర్పంచి పదవి ఏకగ్రీవం చేయడంపై..సర్పంచ్ అభ్యర్థి కొల్లు అప్పలరాజు ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశారు. తాను వేసిన నామినేషన్‌ను ఎలాంటి కారణాలు లేకుండా అధికారులు తిరస్కరించినట్టు ఫిర్యాదులో తెలిపారు. నామినేషన్ వెనక్కి తీసుకోకపోయినా, ఉపసంహరించుకున్నట్టు అధికారులు పత్రాన్ని చేతిలో పెట్టి పంపారని ఆవేదన వ్యక్తంచేశారు. దౌర్జన్యాలు, దాడులతో తాము బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవం కావాలంటూ వైకాపా ప్రయత్నాలు చేస్తుందని... తెదేపా నేత పల్లా శ్రీనివాస్ ఆరోపించారు. విశాఖ జిల్లా పెదనాగమయ్యపాలెం పంచాయతీలో. వైకాపా కార్యకర్తల దాడిలో గాయపడిన రాంబాబు అనే బాధితుడిని ఆయన పరామర్శించారు.
కడపజిల్లా పోరుమామిళ్ల పంచాయతీకి తెదేపా బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు..వైకాపా నేత నాగార్జున తనపై తప్పుడు కేసులు పెట్టించాడంటూ..సుధాకర్ అనే వ్యక్తి ఆరోపించారు. ఒత్తిడి తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో పాలైనట్లు వెల్లడించాడు. బాధితుడిని పరామర్శించిన తెదేపా నేతలు....అక్రమ కేసులపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
మాచర్ల సీఐ భక్తవత్సలరెడ్డిని ఎన్నికల విధులు నిర్వహించకుండా నిలువరిస్తూ ఆదేశించాలని కోరుతూ... న్యాయవాది పారా కిశోర్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. తెదేపా కార్యకర్తలను, నేతలను సీఐ బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ఇదీచదవండి