ఒకరి కళ్లు మరొకరి కళ్లతో మాట్లాడ గలవా...? అంటే అవును మాట్లాడుతాయి అంటున్నారు తెలంగాణ మహబూబ్నగర్ జిల్లాలోని పోతిరెడ్డిపల్లికి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు హన్మంతు. నయనాలు మాట్లాడుకోవడానికి ఓ భాష కూడా ఉందని చెప్తున్నారు. అందులో అచ్చులు, హల్లులు, గుణింతాలు, ఒత్తులు, పదాలు, వాక్యాలన్నీ ఉన్నాయని వాటిని నేర్చుకుంటే కళ్లు ఏవైనా మాట్లడగలవంటున్నారు. ఈ నేత్ర భాషకు రూపకల్పన చేసిన హన్మంతు తమ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలకు నేర్పించారు. ప్రస్తుతం ఆ పిల్లలిద్దరూ... కళ్లతోనే మాట్లాడుకుంటూ అందరినీ అబ్బుర పరుస్తున్నారు.
తెలుగు ఉపాధ్యాయుడు హన్మంతు ప్రోత్సాహంతో
తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా కోస్గి మండలం పోతిరెడ్డిపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో హన్మంతు తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. 2015లో హైదరాబాద్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఖమ్మం విద్యార్థులు ప్రదర్శించిన నేత్రావధానాన్ని చూసి ముగ్ధులయ్యారు. కంటి సైగలతో మాటలు చెబితే.. చెప్పిన మాటని చెప్పినట్లుగా అర్థం చేసుకుని... తిరిగి ఆ మాటలకు అక్షరరూపమివ్వడం చూసి ఆశ్చర్యపోయారు. తమ పిల్లలకూ అలాంటి కంటి భాష నేర్పిస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. తన ఆలోచనను విద్యార్ధులతో పంచుకోగా... కంటి భాష నేర్పుకునేందుకు రమాదేవి, సంతోష ముందుకొచ్చారు. వారి కళ్లు, కనుగుడ్ల కదలికలు, కనుబొమ్మలు సైగలను ఆధారంగా చేసుకుని తెలుగులో ప్రతి అక్షరానికి ఒక సంకేతమిచ్చారు.
మూడు వారాల్లోనే
అచ్చులు, హల్లులు, తలకట్టు దీర్ఘాలు, గుణింతాలు, ఒత్తులు ప్రతి దానికి ఓ సంకేతాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత సరళ పదాలు, సంక్లిష్ట పదాలు, వాక్యాలు ఇలా ఒక్కొక్కటి నేర్చుకున్నారు. సంకేతం సృష్టించడం, దాన్ని కళ్లలో పలికించడం, కంటి భాషను అర్థం చేసుకోవడం ఇవన్నీ కేవలం మూడు వారాల్లోనే నేర్చుకున్నారు ఈ పిల్లలు. ఒక్కో అక్షరాన్ని గుర్తుపెట్టుకొని... వాటితో పదాలు కలిపి వాటిని కళ్లతో పలికించడం చాలా కష్టం. అలా కళ్లలో పలికిన మాటల్ని అర్థం చేసుకొని తిరిగి వాటికి అక్షరరూపమివ్వడం మరీ కష్టం. కానీ రమాదేవి ఎలాంటి పదాలనైనా కంటితో పలికిస్తే.. దాన్ని అలాగే అర్థం చేసుకుని సంతోష అక్షర రూపమిస్తోంది.
రాజుల కాలంలో వేగులు, గూఢచారులు కంటి సంకేతాలతో రహస్యాలను ఇతరులకు చేరవేసే వారని పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుత సమాజంలో ఆపద సమయంలో కంటి భాష రహస్య సంకేతాల మార్పిడి కోసం ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: ఆదిలాబాద్ జిల్లాలో వెలుగులోకి మరో జలపాతం