Covid Guidelines: తెలంగాణలో కొవిడ్ ఆంక్షలను నెలాఖరు వరకు పొడిగించారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి తెలంగాణలో ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ర్యాలీలు, బహిరంగసభలతో పాటు జనం గుమిగూడేలా మతపరమైన, రాజకీయపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలను నిషేధించారు. ప్రజారవాణా, దుకాణాలు, మాల్స్, సంస్థలు, కార్యాలయాల్లో విధిగా మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించేలా ఆయా సంస్థల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. ప్రవేశద్వారాల వద్ధ థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేసి శరీర ఉష్ణోగ్రతలు పరిశీలించాలి. బహిరంగప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించాలి. గతంలో విధించిన ఆంక్షల గడువు ఇవాళ్టితో ముగియనుంది. దీంతో ఆంక్షలను నెలాఖరు వరకు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
మరోసారి ఫీవర్ సర్వే
Ministers Review On Covid: మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా మరోసారి ఫీవర్ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జ్వర లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మెడికల్ కిట్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు.. కలెక్టర్ల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. క్రమంగా పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో... అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.
కలిసికట్టుగా కట్టడి చేద్దాం
తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి తీరు, కట్టడి చర్యలపై సమావేశంలో చర్చించినట్లు హరీశ్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ తీరుతెన్నులపై... కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. గతంలో ఫీవర్ సర్వేతో దేశంలోనే ఆదర్శంగా నిలిచామని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. పకడ్బందీగా జ్వర సర్వే చేపట్టి కొవిడ్‌ను కట్టడి చేద్దామని హరీశ్... కలెక్టర్లకు సూచించారు. వ్యాక్సినేషన్‌లోనూ వెనుకబడిన ప్రాంతాలపై దృష్టి సారించాలని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: