పరీక్షలు దగ్గర పడుతున్నాయి. సమయం ఉంది కదా! రేపటి నుంచి పుస్తకాలు ముందు వేసుకుంటే.. ఇక లేచేది లేదసలు అని సతీశ్ అనుకున్నాడు. అయితే ఆ నిర్ణయం.. సాగుతూ.. రేపే పరీక్ష ప్రారంభం అనే వరకూ వెళ్తుంది. ఇది ఒక సతీశ్ సమస్యే కాదు ఎంతోమంది విద్యార్థులది. ఒకవేళ ఎలాగో మెుదలుపెట్టినా.. ఆసక్తిగా, శ్రద్ధగా చదవకుండానే దుకాణం సర్దేస్తారు. ఇది తాత్కాలికంగా హాయినే.. ఇస్తుంది. కానీ ధీర్ఘకాలిక ప్రభావమే ఎక్కువ. మెుదటికే మోసం వస్తుంది.
ఈ విషయం మీకు తెలుసా
ఓ అధ్యయనం ప్రకారం కళాశాల విద్యార్థుల్లో 75 శాతం మందికి చదువు వాయిదా వేసే అలవాటు ఉందని ఒప్పుకున్నారు. ఇదే తమ అభివృద్ధికి అవరోధమని 50 శాతం అంగీకరించారు. వాయిదా భూతాన్ని వదిలించుకోగలిగితే.. ఒత్తిడి లేకుండా చదివి పరీక్షలు బాగా రాస్తారు.
ఇవి పాటిస్తే.. సరి!
తప్పించుకోలేనపుడు.. చేసేయ్యాలి!
కొన్ని పనులు ఒక్కసారి తప్పించుకుంటే జీవితంలో చేసే పనుండదు. కానీ పరీక్షల ప్రిపరేషన్/ రివిజన్ తప్పించుకునే వీలుందా? అందుకే అలాంటివి స్వీకరించాలి. ఎంత త్వరగా చదవడం మెుదలుపెడితే.. అంత మంచిఫలితాలు వస్తాయి.
చిన్నచిన్న భాగాలు చేయాలి
కష్టంగా భావించే సిలబస్ మెుత్తాన్నీ ఒకేసారి చదవాలని ప్రయత్నించొద్దు. చిన్న చిన్న భాగాలుగా చేసుకుంటే.. సులువుగా, చకచకా పూర్తవుతాయి. ఆసక్తి పెరుగుతుంది.
వాటి కోసం ప్రణాళిక తప్పనిసరి
ఈ పాఠం పరీక్షలో రాదని..మీకు మీరే నిర్ణయించుకుంటారు. ఎందుకంటే మీకు ఆ పాఠ్యాంశంపై ఆసక్తి తక్కువ. వాటిని పక్కనపెడితే.. మీకే నష్టం. కష్టమైన సబ్జెక్టులు/ అధ్యాయాలు ఉదయపు వేళల్లో చదివేలా ముందు రోజు రాత్రి ప్రణాళిక వేసుకోవాలి.
అవాంతరాలున్నాయా?
స్నేహితులతో బాతాఖానీ, ఫోన్ సంభాషణలు, సోషల్ మీడియాలో సంచారం, టీవీ చూడటం లాంటివి.. చదవటానికి ఆసక్తి లేకుండా చేస్తాయి. కాసేపయ్యాక చదువుదాంలే అని వాయిదా వేసేలా చేస్తాయి. ఇలాంటివి లేకుండా జాగ్రత్తపడాలి.
సాకులు అనేకం
- మన ఫ్రెండ్స్ ఎవరూ ఇంకా మెుదలుపెట్టనే లేదు. ఇప్పుడే ఎందుకు?
- మా కజిన్ సంవత్సరమంతా పుస్తకమే ముట్టుకోలేదు. కానీ పరీక్షల ముందు కదలకుండా చదివి మంచి మార్కులు తెచ్చేసుకున్నాడు, తెలుసా? మనం అలానే చేద్దాం.
- స్డడి మెటీరియల్ పూర్తిగా మన దగ్గర్లేదు. అదొచ్చాక స్టార్ట్ చేద్దాం.
- కాసేపు టీవీ చూసి రిలాక్స్ అయి చదువుకుంటే బాగా ఎక్కుతుంది.
- నిద్ర చాలా ముఖ్యం కదా? తొందరగా పడుకుంటే పొద్దున్నే నిద్ర లేవొచ్చు. చక్కగా ప్రిపేర్ కావొచ్చు.
- కష్టమైన ప్రశ్నలు/ సబ్జెక్టులు పరీక్ష ముందు చదివితే గుర్తుంటాయట. ఇప్పుడు చదివినా ఉపయోగం లేదు.
- ఇలాంటి సాకులతో వాయిదా వేసుకున్నారంటే.. ఫలితాలతో మాత్రం దిమ్మతిరిగిపోతుంది. మన పక్కన ఉన్నవాడే ముందుకెళ్తాడు. మనం మాత్రం అక్కడే.. మళ్లీ అవే సాకులతో కాలం గడిపేస్తాం. వాయిదాలు వదిలి ఇప్పుడే చదివేయండి.
'రేపటి పని ఈరోజే చేయి. ఈరోజు పని ఇప్పుడే చేయి.'
ఇదీ చదవండి: పరీక్షలంటే భయమేల.. వలదు వలదు