విజయవాడ వాంబే కాలనీలో ఈవెంట్ డ్యాన్సర్ గాయత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కృష్ణా జిల్లా నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధి వాంబేకాలనీలోని సీ1 బ్లాక్ ప్రాంతంలో చిల్లర దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న అడబాల కోటమ్మ, వెంకట రమణారావు దంపతులకు గాయత్రి సంతానం. పాలిటెక్నిక్ చదువుకునే సమయంలో నగరానికి చెందిన పల్లంట్ల సంతోష్ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈవెంట్ డ్యాన్సర్‌గా పని చేస్తోంది. భర్త మార్బుల్ పనులు చేస్తుంటాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతులకు ఇద్దరు కుమారులు వాసుదేవ రమేష్(8), డీన్ కుమార్(6) ఉన్నారు.
ఈ నెల 17న రాత్రి భర్త కూరగాయల కోసం బయటకు వెళ్లాడు. పిల్లలు ఇంటి బయట ఆడుకుంటున్నారు. గాయత్రి ఆత్మహత్యకు ముందు కో-డ్యాన్సర్ నీలిమ అనే యువతి ఇంటికి వచ్చి వెళ్లింది. ఇద్దరి మధ్య ఇంట్లో వివాదం జరిగినట్లు సమాచారం. నీలిమ వెళ్లిపోయిన తర్వాత.. ఇంట్లో ఉన్న గాయత్రి తలుపులు వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత పిల్లలు వెళ్లి తలుపు కొట్టగా.. తీయకపోవటంతో.. సమీపంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లి చెప్పారు. కోటమ్మ వచ్చి చూడగా గాయత్రి ఉరేసుకుని కనిపించింది. ఈలోపు ఇంటికి వచ్చిన సంతోష్ కుమార్, కోటమ్మ కలిసి బాధితురాలిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే గాయత్రి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. నున్న గ్రామీణ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వివరాలు సేకరించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నీలిమ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: