Govt on PRC issue: పీఆర్సీ, ఫిట్‌మెంట్ సహా 71 డిమాండ్ల పరిష్కారం కోరుతూ చేపట్టిన ఉద్యమాన్ని.. తాత్కాలింగా వాయిదా వేస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతోపాటు రాతపూర్వక హామీ ఇచ్చేందుకు అంగీకరించిందని వారు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై వచ్చే బుధవారం (ఈనెల 22) నుంచే దృష్టి పెడతామనే హామీ ప్రభుత్వం నుంచి లభించిందన్నారు.
గురువారం సాయంత్రం సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు చర్చించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి మంత్రి బుగ్గన విలేకరులతో మాట్లాడారు.
సమస్యలు ఒక్క రోజులో పరిష్కారమయ్యేవి కావు: మంత్రి బుగ్గన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై అన్ని సంఘాలతో సానుకూలంగా చర్చలు జరిగాయి. ఇవన్నీ ఒక్క రోజులో అయ్యేవి కావు. ఉమ్మడి బాధ్యతతో ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి మాట్లాడుకుంటూ దశలవారీగా (పీరియాడికల్) నిర్ధిష్ట కాలపరిమితి పెట్టుకుని ఒక్కొక్కటీ పరిష్కరించుకుంటాం. ఉద్యోగ సంఘాల నాయకులంతా వారి డిమాండ్లను, వినతులను కూలంకషంగా వివరించారు. ఎప్పటికప్పుడు పరిష్కారం కావాల్సిన సమస్యలు కరోనా, లాక్‌డౌన్, ఆరోగ్య సమస్యలతో ఆలస్యమయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీటిని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తారు. నేనూ పర్యవేక్షిస్తుంటా. ఉద్యోగ సంఘాలు తమ ఆందోళన విరమించుకోవాలి. ఉద్యోగ సంఘాల నాయకులు, ఆఫీసు బేరర్లు సమస్యలపై చర్చించారు. వీటిపై అందరం ఏకాభిప్రాయానికి వచ్చాం.
మొత్తం 96 డిమాండ్ల ప్రస్తావన..
చర్చల్లో భాగంగా సచివాలయ ఉద్యోగ సంఘం తరపున 11 డిమాండ్లను ప్రస్తావించాం. పెరుగుతున్న పని ఒత్తిడి నేపథ్యంలో సచివాలయంలో అదనపు పోస్టులు సృష్టించాలని... ఏఎస్‌ఓ, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయాలని, సస్పెండ్ అయిన ముగ్గురిని విధుల్లోకి తీసుకోవాలని చెప్పాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 85 అంశాల్లో భాగంగా... పలు అంశాలను ప్రస్తావించాం. సాధారణ బదిలీలకు అనుమతించాలని విన్నవించాం. అసెంబ్లీలో పనిచేసే ఉద్యోగులకు, జిల్లాల్లో పనిచేసే వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరాం. -కె.వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం
బంతి ముఖ్యమంత్రి కోర్టులో ఉంది...
వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్వీసులు, ఉద్యోగుల పదోన్నతులు, నిబంధనలపై ప్రాధాన్యాల వారీగా చర్చించారు. వచ్చే బుధవారం అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించి... ఆర్థికేతర సమస్యలు, సర్వీసు విషయాలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారు. పీఆర్‌సీపై ముఖ్యమంత్రి వద్ద సమావేశం ఏర్పాటు చేసి... సోమవారం సాయంత్రానికి ముగింపు పలకాలని కోరాం. బంతి ముఖ్యమంత్రి కోర్టులో ఉంది. ఆలస్యం చేసే కొద్దీ ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతుంది. అంచనాల మేరకు లేకున్నా... ఉద్యోగులు గౌరవప్రదంగా జీవించేలా సంతృప్తికరమైన ఫిట్‌మెంట్‌ను సీఎం ఇస్తారని విశ్వసిస్తున్నా. - సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
ప్రభుత్వంపై నమ్మకంతో ప్రభుత్వ కోరిక మేరకు తాత్కాలిక విరమణ
ఉద్యోగుల 70 డిమాండ్లపై చర్చించాం. పీఆర్‌సీ 71వ డిమాండ్... సుదీర్ఘంగా వీటిపై చర్చించారు. జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ బకాయిలు రూ.1,600 కోట్లు పెండింగులో ఉన్నాయి. త్వరలోనే ఆర్థిక పరమైన సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. వచ్చే బుధవారం నుంచే సమావేశాలు ప్రారంభించి, చర్చించి పరిష్కరిస్తామన్నారు. ఈ విషయాన్ని రాత పూర్వకంగా ఇస్తామన్నారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతిలో 200 సంఘాలు ఉన్నాయి. అందరం ఉద్యమించాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెరుగైన పీఆర్సీ కావాలని కోరాం. ప్రభుత్వంపై నమ్మకంతో ప్రభుత్వ కోరిక మేరకు ఈ ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. - బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ ఛైర్మన్
సమస్యలు పరిష్కరిస్తామన్నారు.. తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం
11వ పీఆర్‌సీ అమలుతోపాటు మిగిలిన 70 సమస్యలు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్థిక మంత్రి 70 సమస్యలపై పరిశీలించారు. ఆర్థికేతర సమస్యలు ఇంతకాలం పెండింగ్‌లో ఎందుకున్నాయో పేర్కొన్నారు. వాటిలో చాలావాటిని పరిష్కరిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు. అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో బుధవారం చర్చించి వీలైనంత వరకు పరిష్కరిస్తామని, మిగిలిన వాటిని తర్వాత దశల వారీగా పరిష్కరిస్తామన్నారు. పీఆర్‌సీ అమలు దిశగానూ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని విరమించాలని కోరారు. వారిద్దరి హామీ మేరకు తాత్కాలికంగా ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నాం. - బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి
ఇదీ చదవండి:
Srisailam Temple Tickets Scam: శ్రీశైల ఆలయ కల్యాణకట్ట టికెట్ల గోల్‌మాల్ కేసులో ఏడుగురు అరెస్టు