Employees Problems: ‘కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌తో (సీపీఎస్) లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తును కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టారు. ఈ విధానాన్ని రద్దు చేస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇప్పుడు జీపీఎస్ అమలు చేస్తామని చెబితే ఒప్పుకోవడానికి, నమ్మడానికి ఇక్కడ అమాయకులు ఎవరూ లేరు. అధికారంలోనికి వచ్చాం కదా అనుకుంటే సరిపోదు.. మళ్లీ ఎన్నికలు రానున్నాయని గమనించాలి’ అని ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం (ఏపీసీపీఎస్‌ఈఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పార్థసారథి హెచ్చరించారు.
‘సీఎం, అధికారులు ఒక వర్గంగా ఏర్పడి ఉపాధ్యాయులు, ఉద్యోగులపై అప్రకటిత యుద్ధం చేస్తున్నారు. షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్లతో వేధిస్తున్నారు. ఇది సరికాదు’ అని ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర గౌరవ సలహాదారు బాజీ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దు కోరుతూ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ధర్మ పోరాటం పేరిట ఆదివారం పెద్దఎత్తున ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు.
జిల్లాతోపాటు విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా జిల్లాల నాయకులు పాల్గొన్నారు. చెవిలో పువ్వులు, భిక్షాటన, అర్ధనగ్న ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించారు. సీపీఎస్ రద్దుపై ఆగస్టు నెలాఖరులోగా తేల్చకపోతే, సెప్టెంబరులో మిలీనియం మార్చ్ నిర్వహిస్తామని.. ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: రిటైర్మెంట్ వయసు పెంపుపై జారీకాని ఉత్తర్వులు