INS Ranvijay 37th Anniversary : భారత నౌకాదళంలో కీలకమైన తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో దాదాపు 50కిపైగా యుద్ధనౌకలు, ఐదుకు పైగా జలాంతర్గాములు, మరెన్నో యుద్ధ విమానాలు, హెలీకాప్టర్లు. సాగర తీరంలో పొంచివున్న ముప్పుని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇవి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. వీటిలో ఐఎన్‌ఎస్ రణ్‌విజయ్ యుద్ధనౌకది ప్రత్యేక స్థానం. సముద్ర జలాల్లో పటిష్టంగా పహారా కాస్తూ 37 ఏళ్లుగా అలుపెరగకుండా సేవలందిస్తోంది.
రష్యాలో తయారైన ఐఎన్‌ఎస్ రణ్‌విజయ్ డిసెంబర్ 21, 1987లో జైత్రయాత్రను ప్రారంభించింది. కాషిన్ తరగతి డిస్ట్రాయర్‌గా పోరాట పటిమ దీని సొంతం. 5000ల టన్నుల గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్‌గా 37 సంవత్సరాలుగా తిరుగులేని విధంగా ఎన్నో విజయవంతమైన కార్యకలాపాలను నిర్వహించింది. సంగ్రామే వైభవస్య అంటే యుద్ధంలో అద్భుతమైనది అనే నినాదం దీనిపై ప్రతిబింబిస్తుంది. ఉపరితలం నుంచి ఉపరితలం, ఉపరితలం నుంచి గగనతలంలోకి క్షిపణులను ప్రయోగించే సత్తా రణ్‌విజయ్ సొంతం. యాంటీ సబ్‌మెరైన్ రాకెట్‌లతో పాటు టార్పెడోలను కూడా కాల్చగల సామర్థ్యంతో నౌకను తీర్చిదిద్దారు.
INS Ranvijay in Navy : సముద్రంలో యుద్ధానికి సంబంధించి అన్ని డొమైన్‌లను కవర్ చేసే విస్తృత శ్రేణి సెన్సార్‌లతో యుద్ధనౌక నిండి ఉంది. కమోవ్ 28 హెలికాప్టర్‌ను మోసుకుపోయే సామర్థ్యం ఉంది. రణ్‌విజయ్ ఆధునీకరణ తర్వాత మరిన్ని అత్యాధునిక ఆయుధాలను జతచేశారు. దాదాపు 500 వరకు సిబ్బంది, నావికులు యుద్ధ నౌకలో విధులు నిర్వహిస్తున్నారు.
ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌకపై కీలక యుద్ధ విమానాల విన్యాసాలు విజయవంతం
భారత అమ్ములపొదిలోకి స్వదేశీ యుద్ధనౌక విక్రాంత్.. శత్రుదేశాలకు చుక్కలే!