Dachepalli Road Accident : పల్నాడు జిల్లా దాచేపల్లిలో ప్రమాదం చోటుచేసుకుంది. గొర్రెల మందపై ఓ ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 100 గొర్రెలకు పైగా మృతి చెందాయి. మరో వంద గొర్రెలకు గాయాలయ్యాయి. ప్రమాదంలో గొర్రెల కాపరి మల్లేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. మల్లేశ్ మహబూబ్‌నగర్ నుంచి దాచేపల్లికి గొర్రెల మందతో వచ్చాడు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వ్యక్తి తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మల్లేష్‌గా గుర్తించినట్లు పోలీసులు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు వదిలి డ్రైవర్ పరారయ్యాడని చెప్పారు. ఈ ఘటనకు అతివేగం, నిద్రమత్తే కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Gottipati on Dachepalli Incident : దాచేపల్లి ఘటనపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరా తీశారు. దీనిపై కలెక్టర్, ఎస్పీతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. గాయపడిన గొర్రెల కాపరికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అద్దంకి-నార్కట్‌పల్లి మార్గంలో రోడ్డుప్రమాదాలపై అధికారులు దృష్టిపెట్టాలని చెప్పారు. వేగ నియంత్రణపై ట్రావెల్స్ సిబ్బందికి, డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గొర్రెల కాపరులకు న్యాయం చేస్తామని గొట్టిపాటి రవికుమార్ భరోసా ఇచ్చారు.