Conspiracies Again on Amaravati : రాజధాని అమరావతిపై దుష్టశక్తుల కుట్రలు, కుయుక్తులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఎన్డీయే సర్కార్ రాజధాని పనుల్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తుంది. దీంతో కన్నుకుట్టిన ఆ దుష్టశక్తులు మళ్లీ కలుగులోంచి బయటకు వచ్చాయి. అమరావతికి మద్దతిచ్చిన పార్టీలకు ఎన్నికల్లో ఏపీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అయినా ఆ దుష్టశక్తులకు బుద్ధి రాలేదు. రాజధానికి ప్రపంచబ్యాంకు రుణం రాకుండా అడ్డుకునేందుకు మళ్లీ ఫిర్యాదుల పర్వానికి తెరతీశాయి.
అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ కలసి రూ.15,000ల కోట్ల రుణం ఇస్తుండడంతో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి తాజాగా ఈ నెల 18న ప్రపంచబ్యాంకు ఇన్‌స్పెక్షన్ ప్యానల్‌కి ఒక ఫిర్యాదు వెళ్లింది. రాజధాని నిర్మాణానికి భూసమీకరణ చేయడం చట్టవిరుద్ధమని, అన్నదాతల్ని బెదిరించి, భయపెట్టి సంతకాలు చేయించుకున్నారని అసత్య ఆరోపణలు చేశారు. దానివల్ల అక్కడి ప్రజలు జీవనభృతి కోల్పోయారని, ఆహారభద్రతకు విఘాతం కలుగుతోందని, సామాజిక ఆర్థిక, పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని అందులో తెలిపారు. కర్షకులతో అర్థవంతమైన చర్చలు జరపలేదని, సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నిర్మాణ కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని ఫిర్యాదులో వివరించారు.
పదే పదే అవే పన్నాగాలు : 2014 నుంచి 2019 మధ్య కూడా వైఎస్సార్సీపీ ప్రేరేపిత శక్తులు అమరావతిపై ఇలాంటి కుట్రల్నే అమలు చేశాయి. అప్పట్లో రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఏఐఐబీ కలసి రూ.3500 కోట్ల రుణం ఇచ్చేందుకు సిద్ధపడింది. అయితే ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. వాటిపై అప్పట్లో ప్రపంచబ్యాంకు ఇన్‌స్పెక్షన్ ప్యానల్ ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఆ బృందం పలు దఫాలు రాజధాని ప్రాంతంలో పర్యటించి, అన్నదాతలతో సమావేశాలు నిర్వహించింది. అక్కడ ఎలాంటి ఉల్లంఘనలూ లేవని కర్షకులు స్వచ్ఛందంగానే భూములిచ్చారని నిగ్గుతేల్చింది.
ఈ క్రమంలో అమరావతికి రుణం ఇచ్చేందుకు అంతా సిద్ధమైన దశలో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ రుణం అక్కర్లేదని తేల్చిచెప్పింది. రాజధాని విధ్వంసానికి కంకణం కట్టుకుని ఐదు సంవత్సరాల పాటు అనేక కుట్రలు అమలుచేసింది. ఏపీలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక అమరావతికి మొదటి ప్రాధాన్యమిచ్చి నిర్మాణ పనుల్ని వేగంగా పట్టాలెక్కిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి రాజధానికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోంది. ఇది గిట్టని కొందరు అమరావతి అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగంగా ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదు చేశారు.
రూ.33 వేల కోట్లతో అమరావతిలో నిర్మాణాలకు పచ్చజెండా
"అమరావతి రాజధాని"లో ఆ డిజైన్‌కే ఎక్కువ మంది ఓటు - ఫిక్స్ చేసిన CRDA