వచ్చే ఏడాది జులైలో 12వ పీఆర్సీ(PRC) కమిషన్ వేయాల్సి ఉంది..!. 11వ పీఆర్సీకి సంబంధించిన హామీలే ఇంతవరకు అమలుకు నోచుకోవడం లేదు. అసలు వేతన సవరణను ఐదేళ్లకు ఒకసారి చేస్తారా లేదా? 3 నెలల కిందట మంత్రుల కమిటీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. రికవరీల రద్దుపై ఉత్తర్వులు ఎందుకు ఇవ్వడం లేదు?. సీపీఎస్(CPS) అంశాన్నీ ఎందుకు జటిలం చేస్తున్నారు..? ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ప్రశ్నలివి.
పీఆర్సీపై జనవరి 17న ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఉద్యమించాయి. ఫిబ్రవరి 3న విజయవాడ BRTS రోడ్డుపై నిర్వహించిన.. చలో విజయవాడ కార్యక్రమంతో ప్రభుత్వం మెట్టు దిగింది. ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ.... చర్చింది, ఫిబ్రవరి 5న ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత కొన్ని అంశాలపై ఫిబ్రవరి 20న ఉత్తర్వులు జారీచేసింది. మిగిలిన వాటిపై ఇంతవరకు ఆదేశాలివ్వలేదు.
అన్ని రకాల రికవరీలను నిలిపివేస్తామని.. ఉత్తర్వులిస్తామని మంత్రుల కమిటీ చెప్పింది. పీఆర్సీని 2020 ఏప్రిల్ నుంచి అమలు చేశారు. అంతకుముందు.. 2019 జులై నుంచి 2020 మార్చి 30 వరకు ఐఆర్ 27 శాతం ఇచ్చారు. ఈ 9 నెలల కాలానికి రికవరీలను ప్రస్తుతానికి నిలిపేసినా.. ఇప్పటికీ ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో రికవరీల కత్తి ఉద్యోగులపై వేలాడుతూనే ఉంది. గురుకులాలు, ఆర్టీసీ, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు పీఆర్సీ అమలుకు ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉండగా.. వాటి ఊసే లేదు. ఆటోమేటిక్ అడ్వాన్స్‌డ్ స్కేళ్లపై 6, 12, 18 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని పదోన్నతులు లభించని ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లపై ఉత్తర్వులు జారీ కాలేదు.
కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం(CPS) రద్దుకు సంబంధించి మార్చి 30లోగా రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. ఇందుకు విరుద్ధంగా గత నెల 25న గ్యారంటీ పింఛన్ స్కీమ్- జీపీఎస్(GPS)ను తెరపైకి తెచ్చింది. జీపీఎస్‌ను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జీపీఎఫ్, పీఎఫ్, ఏపీజీఎల్ఐ రుణాలు, క్లెయిమ్‌లు వంటి వాటికి సంబంధించి రూ. 2 వేల 100 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ ఏప్రిల్ నాటికి క్లియర్ చేస్తామని హామీ ఇచ్చినా అమలవలేదు. కేంద్రం అమలు చేస్తున్నట్లుగానే పీఆర్సీ పదేళ్లకు వేస్తారని ప్రభుత్వానికి అధికారుల కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఐదేళ్లకు పీఆర్సీ ఉండేలా ఆదేశాలిస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. ఐదేళ్ల పీఆర్సీ ప్రకారం వచ్చే ఏడాది జులైలో 12వ పీఆర్సీ కమిషన్ వేయాల్సి ఉంటుందని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు.
ప్రభుత్వం తానిచ్చిన హామీలనూ తుంగలో తొక్కుతోందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీపీఎస్ హామీని ఉల్లంఘించిందని మండిపడుతున్నారు. పీఆర్సీ చర్చల వేళ మంత్రుల కమిటీ ఇచ్చిన హామీ మేరకు.. ఉత్తర్వులు ఇవ్వకపోవంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఇదీ చదవండి: "ఉచిత విద్యుత్‌కు మంగళం పాడేందుకే.. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు"