Electricity workers protest: రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనం ఇంకా రాకపోవడంతో ఉద్యోగులంతా రోడ్డెక్కారు. నిన్న విద్యుత్ కార్యాలయాల ముందు ధర్నాలు చేసి నిరసన తెలిపిన ఉద్యోగులు... ప్రయోజనం లేకపోవడంతో ఇవాళ కూడా భోజన విరామ సమయంలో ఆందోళనకు దిగారు. విజయవాడ సూర్యారావు పేటలోని ఏపీసీపీడీసీఎల్ కార్యాలయం ముందు పెద్దఎత్తున విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేశారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగం చేస్తోన్నామని... ఎప్పుడూ ఒకటో తేదీన వేతనాలు బ్యాంకు ఖాతాలో ఠంఛనుగా జమ అయ్యేవని ఉద్యోగులు తెలిపారు.
13 రోజులు దాటినా జీతాలివ్వలేని పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు. సకాలంలో జీతాలివ్వకపోవడం వల్ల అల్లాడి పోతున్నామని ఉద్యోగులు వాపోయారు. బ్యాంకుల అప్పులకు ఈఎంఐలు, ఇంటి అద్దెలు కట్టలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి ఖర్చులకూ డబ్బులేని స్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం వెంటనే తమకు జీతం చెల్లించే ఏర్పాట్లు చేయాలని... లేని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఉద్యోగులు, ఐకాస నేతలు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: