భవిష్యత్తు కార్యాచరణపై తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Eetala rajender) రెండు, మూడు రోజుల్లో కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా (Jp nadda)ను సోమవారం కలిసిన ఈటల మంగళవారం దిల్లీలోనే ఉండిపోయారు. ఈటల, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ ఛుగ్ దిల్లీలో మంగళవారం గంటన్నరకుపైగా చర్చలు జరిపారు.
రాజీనామా!
తొలుత శాసన సభ్యత్వానికి, తెరాసకు రాజీనామా చేయాలని ఈటల నిర్ణయించుకున్నట్లు తెలిసింది. నియోజకవర్గానికి వెళ్లి మరోసారి నాయకులు, ముఖ్య కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈటలతో పాటు ఏనుగు రవీందర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తారని తెలిసింది. మంగళవారం నాటి చర్చల్లో వివిధ జిల్లాల్లో తెరాస అసంతృప్తులు ఎవరు? వారిలో వెంటనే పార్టీ వీడేవారు ఎవరు? వారితో ఆయా నియోజకవర్గాలు, జిల్లాల్లో కలిగే ప్రయోజనం ఎంత అనే అంశాలను చర్చించినట్లు తెలిసింది.
నడ్డాతో భేటీ..
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) మంగళవారం సాయంత్రం జాతీయ అధ్యక్షుడు నడ్డాతో గంటకుపైగా భేటీ అయ్యారు. తాజా పరిణామాలను వివరించారు. మంగళవారం సాయంత్రం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి దిల్లీకి చేరుకున్నారు. సంజయ్, ఈటల, ఏనుగు రవీందర్‌రెడ్డి, వివేక్‌లను రాత్రి భోజనానికి ఆహ్వానించారు. కాస్త దూరంగా ఉన్నందున రాలేనని సంజయ్ తెలిపారు.
ఈటల, రవీందర్‌రెడ్డి, వివేక్ రాత్రి కిషన్‌రెడ్డి నివాసంలో రాత్రి భోజనం చేశారు. రాత్రి 11 గంటల వరకు వారి మధ్య వివిధ అంశాలపై చర్చలు జరిగాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సంజయ్ బుధవారం హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈటల, ఏనుగు రవీందర్‌రెడ్డి బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు.
ఇదీ చూడండి: