పాఠశాలలతో పాటు ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు కొవిడ్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ఆగష్టు 16వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి కళాశాలలు ప్రారంభించిన దృష్ట్యా.. గురువారం విద్యా శాఖామంత్రి అదిమూలపు సురేష్, విద్యా శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖాధికారులతో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో గల కొవిడ్ పరిస్టితులను విశ్లేషణ చేస్తూ, ఇప్పటివరకు వాక్సిన్ వేయించుకున్న ఉపాధ్యాయుల వివరాలు మరియు ప్రస్తుతం కొవిడ్(covid) పాజిటివ్‌గా నమోదైన విద్యార్ధులు, ఉపాధ్యాయుల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 97.5 శాతం ఉపాధ్యాయులకు టీకా వేశారని.. మిగిలిన 7,388 మందికి మాత్రమే టీకా వేయాల్సి ఉండగా.. 100 శాతం పూర్తి చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.
దీనిపై స్పందించిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కాటంనేని భాస్కర్.. రాష్ట్రంలో 22 లక్షల వాక్సిన్లు అందుబాటులో వున్నాయని, వాక్సిన్ ఒకేసారి వేయడానికి విద్యా శాఖ ఏ కేంద్రాన్ని ప్రతిపాదిస్తే అక్కడ వాక్సిన్ వేసే ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం జిల్లా విద్యాశాఖాధికారులు ఆయా జిల్లా వైద్యాధికారిని సంప్రదిస్తే చాలని తెలియజేశారు. పాఠశాలల్లో విద్యార్ధులు సామాజిక దూరం పాటిస్తే, చాలావరకు కొవిడ్ వ్యాప్తిని నివారించవచ్చని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఉన్నత విద్యా సంస్థలైన విశ్వ విద్యాలయాలు, డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో సిబ్బంది, విద్యార్థులకు కూడా వాక్సినేషన్ వేయించడానికి తగిన కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు. ఇప్పటికే అన్ని విద్యాసంస్థలలోని సిబ్బందికి వాక్సినేషన్ వేయించవలసిందిగా ఆదేశాలు ఇచ్చామని, ఈ ఆదేశాలను పునరుద్ఘాటిస్తామని కాటంనేని భాస్కర్ తెలిపారు.
ఇదీ చదవండి: CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,439 కరోనా కేసులు.. 14 మరణాలు