విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి అంకం అమ్మవారి జయజయధ్వానాల మధ్య ఘనంగా ముగిసింది. విజయదశమి రోజున అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు రాజరాజేశ్వరిదేవి అలంకరణలో దర్శించుకున్నారు. భవానీ మాలలు వేసుకుని తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కొండపైకి తరలి వచ్చారు.
ఉదయం పూర్ణాహుతితో దసరా వేడుకలు ముగిశాయి. సాయంత్రం ఐదు గంటల తర్వాత నగరోత్సవం నిర్వహించారు. ఆది దంపతుల నగరోత్సవం దేదీప్యమానంగా సాగింది. దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల నగరోత్సవాన్ని నిర్వహించారు. మల్లేశ్వరాలయం నుంచి ప్రారంభమైన నగరోత్సవం మేళతాళాలు, మంగళవాయిద్యాల మధ్య కన్నుల పండువగా సాగింది. కళావేదిక వద్ద ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి ఆలయం నుంచి నగరోత్సవంలో భాగంగా దుర్గాఘాట్ వరకూ ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. సాయంత్రం కృష్ణానదిలో దుర్గామల్లేశ్వరులను హంసవాహనంపై ఉంచి పూజలు చేశారు. విద్యుత్తుకాంతులతో అందంగా అలంకరించిన హంస వాహనంపై దుర్గాఘాట్ నుంచి నదిలో తెప్పోత్సవం నిర్వహించారు. రంగురంగుల విద్యుత్ దీపాలు, సుగంధ శోభిత పుష్పమాలలను అలంకరించిన హంసవాహనంపై గంగా పార్వతీ సమేత మల్లేశ్వరులు కొలువు తీరారు. కృష్ణానదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో జలవిహారం నిలిపివేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.
కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చనుబండలో దసరా అమ్మ వారి ఉరెంగింపులో బుట్ట బొమ్మలు నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటిని ఇక్కడ చేతి వృత్తి పని చేసే మేదర్లు తయారు చేశారు.
ఇదీ చదవండి:
INDRAKEELADRI: దర్శన నిరీక్షణపై భక్తుల ఆగ్రహం.. ప్రభుత్వ తీరుపై నినాదాలు