తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7గంటలకు ప్రక్రియ ప్రారంభం కాగా... నమోదైన పోలింగ్ వివరాలను ప్రతి 2 గంటలకొకసారి పోలింగ్ సరళిని సిద్దిపేట జిల్లా అధికారులు వెల్లడించారు. ఉదయం 9గంటల వరకు 12.74 శాతం పోలింగ్ నమోదు కాగా... 11 గంటల వరకు 34.33 శాతం నమోదైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 55.52 శాతం పోలింగ్ శాతం నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 71.10శాతం, 4 గంటల వరకు 78.12శాతం 5 గంటలకు 81.44శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
అక్కడక్కడా స్వల్ప సమస్యలు
ఉపఎన్నిక కోసం నియోజకవర్గవ్యాప్తంగా 315 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాయపోల్ మండలం ఆరేపల్లిలో 20 నిమిషాల పాటు ఈవీఎం మొరాయించింది. ఇదే సమయంలో పలువురు కార్యకర్తలు కేంద్రంలోకి చొచ్చుకెళ్లగా... పోలీసులు వారందరినీ బయటికి పంపించారు. మరో యంత్రాన్ని తీసుకువచ్చి అధికారులు పోలింగ్ కొనసాగించారు. బూత్‌ల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకున్నారు.
చివరి గంట కరోనా బాధితుల కోసం...
బూత్‌ల వద్ద కేటాయించిన ప్రత్యేక లైన్లలో గర్భిణులు, దివ్యాంగులు వీల్ చైర్లలో వచ్చి ఓటు వేశారు. కొవిడ్ నిబంధనల మేరకు మీటర్ భౌతికదూరం పాటిస్తూ.... ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. చేతి తొడుగులు ధరించి, థర్మల్ స్క్రీనింగ్ చేశాకే అధికారులు ఓటు వేసేందుకు అనుమతించారు. కరోనా బాధితులు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈనెల 10న కౌంటింగ్
పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు ఎన్నికల, పోలీస్ ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ లచ్చపేటలో పర్యటించి... పోలింగ్ పరిస్థితిని పరిశీలించారు. అంతకుముందు లచ్చపేట పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళికెరి పరిశీలించారు. నార్సింగిలోని పోలింగ్ కేంద్రాన్ని సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు. ఈనెల 10న దుబ్బాక ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది.
దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలో 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తెరాస నుంచి దివంగత రామలింగారెడ్డి సతీమణి సుజాత, భాజపా నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారు. హోరాహోరీగా సాగిన ప్రచారంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉపఎన్నికపై ఆసక్తి పెరిగింది. ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని.... గెలుపే లక్ష్యంగా ఎత్తుకు పైఎత్తులు వేశాయి. ఉత్కంఠభరితంగా మారిన దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు ఈ నెల10న వెలువడనున్నాయి.
ఇదీ చూడండి: