వెలుగుల పండుగ కోసం రకరకాల ప్రమిదలు సిద్ధమయ్యాయి. ఇంటి ముంగింట్లో కాంతులు నింపే అందమైన ప్రమిదలతో పాటు నట్టింట్లో ముచ్చటగొల్పేలా వివిధ ఆకృతుల్లో చక్కటి ప్రమిదలు మార్కెట్లోకి వచ్చేశాయి. విజయవాడ ఎంజీ రోడ్డులో నిత్యం రకరాకల మట్టి వస్తువులతో జనాన్ని ఆకట్టుకునే దుకాణాలు ఇప్పుడు దివ్వెల పండుగ కోసం చూడముచ్చటైన ప్రమిదలను సిద్ధం చేశాయి. దీపావళి కోసం ఇంటిని అందమైన దివ్వెలతో నింపాలనుకునే వారి కోసం వందకు పైగా రకాలతో ప్రమిదల ఆకృతులు మార్కెట్లోకి వచ్చేశాయి.
ముచ్చటగొలిపే ఆకృతులు
ఒకప్పుడు దీపావళి అంటే ఇంటి ముందు ప్రమిదలు పేర్చి దీపాలు వెలిగించి.. టపాసులు కాల్చుకుని సంబరంగా జరుపుకునేవారు. ఇప్పుడు ఆ సంబరంలో మరింత ఆకర్షణీయతను కోరుకుంటున్నారు చాలా మంది. ఇళ్లంతా విద్యుద్దీపకాంతులతో నింపే వారు కొందరైతే... విభిన్నమైన ఆకృతుల్లో ఉన్న ప్రమిదలను వెలిగించి ఇంటికి కొత్త కాంతులు తెచ్చుకునే వారు మరికొందరు. అలాంటి వారి కోసం రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి చూడముచ్చటైన ప్రమిదలను తీసుకొచ్చి.. నగరవాసులను ఆకట్టుకుంటున్నారు వ్యాపారులు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన ఈ విభిన్న ప్రమిదలకు విజయవాడ వాసుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోందని వ్యాపారులు చెబుతున్నారు.
విభిన్నం... అద్భుతం
ఇంట్లో వెలిగించుకునేందుకు విభిన్న ఆకృతుల్లో చేతిలో అమరిపోయే ప్రమిద నుంచి పెద్ద ప్రమిదల వరకు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా వాకిట్లో పెట్టుకునే ప్రమిదల్లో సైతం వివిధ రకాలను సిద్ధం చేశారు. ఓంకారం, స్వస్తిక్, పద్మం ఆకారంలో ఉన్న ప్రమిదలు వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇదీ చదవండి:
'కేజీ ప్లాస్టిక్ వ్యర్థాలు తీసుకురండి.. రెండు కేజీల బియ్యం పట్టుకువెళ్లండి'