‘న్యాయస్థానం నుంచి దేవస్థానానికి’ పేరుతో అమరావతి పరిరక్షణ సమితి తలపెట్టిన మహా పాదయాత్ర వల్ల ఘర్షణలు, విద్వేషాలు చెలరేగే అవకాశం ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. అవాంఛనీయ ఘటనలు, అల్లర్లు, ఇతర సమస్యలు తలెత్తకుండా చూసేందుకు దీనికి అనుమతి నిరాకరిస్తున్నట్లు వెల్లడించారు. దరఖాస్తుదారైన అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు ఈ మేరకు గురువారం ఆయన లేఖ రాశారు. పార్టీలపరంగా చీలిపోయిన గ్రామాల మీదుగా ఈ యాత్ర సాగినప్పుడు అక్కడి పరిణామాలు ఘర్షణలకు దారితీయొచ్చని, అప్పుడు శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని ఆ లేఖలో తెలిపారు. ఇది మూడు రాజధానుల అమలు కోరుకునే ప్రాంత ప్రజల్లో శతృత్వానికి కారణమవుతుందని వివరించారు. 47 రోజుల పాటు భారీ పరివారంతో సాగే ఈ యాత్రకు పోలీసు భద్రత కల్పించటం కష్టమని ఆ లేఖలో ప్రస్తావించారు. వీటన్నింటి నేపథ్యంలో ప్రజాప్రయోజనాల దృష్ట్యా పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఆ లేఖలో చెప్పారు. అందులోని ఇతర ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.
* అమరావతి పరిరక్షణకు ఉద్యమించేందుకు శక్తినివ్వాలని, పోరాటం విజయవంతమయ్యేలా చూడాలని కోరుతూ వెంకటేశ్వర స్వామిని మొక్కుకునేందుకు ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు గద్దె తిరుపతిరావు దరఖాస్తులో పేర్కొన్నారు. ఆ అంశానికే వారు పరిమితమయ్యేలా కనిపించట్లేదు. ఇతర అంశాలను తెరపైకి తీసుకురావాలనేది వారి ఉద్దేశంగా అనిపిస్తోంది. ఇది విద్వేషాలకు కారణమవుతుంది. పాదయాత్ర సాగే ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుంది.
* ఈ పాదయాత్రలో ఎంతమంది, ఎవరెవరు పాల్గొంటారనే దానిపై స్పష్టత లేదు. ఒకేచోట భారీసంఖ్యలో జనం గుమిగూడటం వల్ల నిర్వాహకులు కొవిడ్ ప్రోటోకాల్ పాటించటం కష్టం. ఇది కొవిడ్ వ్యాప్తికి కారణమవుతుంది.
* స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటికే సన్నాహక సమావేశం జరిగింది. ఎన్నికల ప్రకటన వస్తే ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుంది. అప్పుడు భారీ ర్యాలీల నిర్వహణకు అవకాశం ఉండదు.
* మూడు రాజధానులపై దాఖలైన రిట్ పిటిషన్ల విచారణ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.
* పాదయాత్రలో పాల్గొనేవారి సంఖ్యపై దరఖాస్తుదారుకు నియంత్రణ లేదు. జాతీయ రహదారులు, రాష్ట్ర ప్రధాన రహదారులు, ఇతర ప్రాంతాల మీదుగా సాగే ఈ పాదయాత్రకు పోలీసు భద్రత కల్పించటం కష్టం.
* అమరావతి పరిరక్షణ సమితి తిరుమల వరకూ పాదయాత్ర చేయాలని తలపెట్టింది. అయితే తిరుమలలో రాజకీయ కార్యక్రమాలకు అనుమతి ఉండదు. ధార్మిక కార్యక్రమాలనూ అక్కడ తితిదేయే పర్యవేక్షిస్తుంది.
ఇదీ చదవండి:
అభ్యంతరకర పోస్టులను తొలగించేందుకు.. ఎందుకు చర్యలు తీసుకోలేదు : హైకోర్టు