దిల్లీ పర్యటన పదవుల కోసమా? కేసుల మాఫీ కోసమా? ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్న వాళ్లు ఇప్పుడు తమ వల్లకాదంటూ చేతులెత్తేశారని విమర్శించారు. విజయవాడలో తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని పరామర్శించి కారు ధ్వంసం వివరాలను అడిగి తెలుసుకున్నారు దేవినేని ఉమా. పట్టాభి కారుపై దాడి పిరికిపంద చర్యని మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నారనే కక్షతోనే ఈ దాడి జరిగిందని ధ్వజమెత్తారు.
సీసీ కెమెరాల ఆధారంగానైనా దోషులను పోలీసులు పట్టుకోలేకపోయారని దేవినేని ఉమా ఆక్షేపించారు. 108 కుంభకోణం, సరస్వతి ఒప్పందం, నీళ్ల దోపిడీని పట్టాభి వెలుగులోకి తెచ్చారని గుర్తుచేశారు. పులివెందుల పంచాయితీలను రాష్ట్రం మొత్తం విస్తరింపజేస్తూ.. బీహార్ సంస్కృతిని ఏపీలో పెంచుతూ తోటలను కూడా నరికేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిరోముండనాలు, దాడులు పెరిగిపోతున్నా మంత్రులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: