తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్యకేసు నిందితుడు మందా సాగర్ ఆత్మహత్యకు యత్నించాడు. వరంగల్ కేంద్ర కారాగారంలో ఘటన చోటుచేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీలో బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో మందా సాగర్ నిందితుడు. ప్రస్తుతం వరంగల్ కేంద్ర కారాగారంలో ఉన్నాడు. ములాఖత్‌లో ఫోన్ మాట్లాడేందుకు వచ్చిన సాగర్.. బ్యారక్‌లోకి తిరిగి వెళ్తున్న సమయంలో స్విచ్ బోర్డులో వేలు పెట్టి ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. వెంటనే స్పందించిన జైలు సిబ్బంది నిందితుడిని హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సాగర్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
అక్టోబర్ 18న దీక్షిత్‌రెడ్డిని కిడ్నాప్ చేసిన నిందితుడు... అదే రోజు సాయంత్రం కేసముద్రం మండలం అన్నారం గ్రామ శివారులోని దానయ్య గుట్టల వద్ద హత్య చేశాడు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి కాల్చివేశాడు. అక్టోబర్ 22న చేసిన నేరాన్ని అంగీకరించాడు.
సాగర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా.... తప్పించుకునేందుకు యత్నించాడా.. అనేది పోలీసుల విచారణలో వెల్లడి కానుంది.