దసరా అంటేనే వాహన అమ్మకాలకు మంచి సీజన్. నవరాత్రుల సమయంలో వచ్చే ఆయుధ పూజకు ఉన్న సెంటిమెంట్‌తో కొత్త వాహనం కొనుగోలు చేయాలంటే దసరా సమయంలో కొనేందుకే ఎక్కువశాతం మొగ్గు చూపుతారు. కరోనా షాక్ నుంచి ఆటోమొబైల్ రంగం కోలుకుంటోందనే చెప్పాలి. బీఎస్6 నిబంధనల కారమంగా అన్ని వాహనాల ధరలు గతంతో పోల్చితే పెరిగినా.. ప్రజలు సొంత బండిని కొనేందుకే సై అంటున్నారు. ఎవరి స్థాయిని బట్టి వారు కార్లు, ద్విచక్రవాహనాలు కొనుగోలు చేస్తుండటంతో వ్యాపారమూ ఆశాజనకంగా సాగుతోంది. గత రెండు నెలల్లో నమోదైన విక్రయాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నీరసంగా ఉన్న అమ్మకాలు, ఆగస్టు నుంచి క్రమేణా వృద్ధి బాట పట్టాయి. దసరా వచ్చే సరికి.. క్రితం ఏడాదితో పోల్చితే కార్లలో 20శాతం వరకూ ద్విచక్ర వాహనాల్లో 30శాతం వరకూ వృద్ధి కనిపిస్తోంది. దసరా, దీపావళిని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల్లోని కార్లపై ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించాయి.
దేశవ్యాప్తంగా కార్ల కంపెనీలు, డీలర్లు.. దాదాపు అన్ని మోడళ్లపై నగదు డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లతో పాటు సరికొత్త పథకాలతో ప్రయోజనాలు అందిస్తున్నాయి. బీఎస్6 వాహన నిబంధనలు వచ్చాక ప్రముఖ సంస్థ మారుతీ సుజికీ డీజిల్ తయారీ వాహనాలను నిలిపివేసింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలకు పెద్దగా వ్యత్యాసం లేకపోవటం.. డీజిల్‌తో పోల్చితే నిర్వహణా ఖర్చులు పెట్రోల్ వాహనాలకే తక్కువ ఉండటంతో ప్రజల ఆలోచనల్లోనూ మార్పు వచ్చి పెట్రోల్ వాహన కొనుగోళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో డీజిల్ వాహనాలతో పోల్చితే పెట్రోల్ వాహనాల మైలేజీ తక్కువ అనే ఆలోచనల నుంచి దక్షణాది ప్రజలు బయటపడ్డారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
లాక్డౌన్ సడలింపులు వచ్చినా పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచి ఇతర సమస్యలతో పలు వ్యాపారాలు కళతప్పినా.. ఆటోమొబైల్ రంగం మాత్రం ఆశాజనకంగా సాగుతూ దసరాకు జోరందుకుంది. కరోనా ప్రభావంతో ఏప్రిల్, మే, జూన్ నెలలు ఆటోమొబైల్ రంగంలో విక్రయాలు పూర్తిగా మందగించాయి. లాక్డౌన్ సడలింపులు వచ్చాక వీటివ్యాపారం క్రమంగా పుంజుకుంది. సొంత వాహనం లేక ప్రజారవాణాపై ఆధారపడిన మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు కరోనా భయంతో సొంతంగా వాహనాల వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కారు కొనగోళు చేయాలంటే లక్షల్లో డౌన్ పేమెంట్ కట్టాలి. అదే ద్విచక్ర వాహనానికైతే వేలల్లో కట్టి ప్రతి నెలా కొంత కట్టుకునే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఎక్కువశాతం మంది వీటికొనుగోళ్లకు క్యూ కడుతున్నారు.
ఓ ప్రయాణికుడితో కలిసి మరో ప్రయాణికుడు వెళ్లేందుకు భయపడే సగటు మనిషిలో వచ్చిన ఆలోచనలే వారి ఆర్థిక స్థోమత బట్టి కారు లేదా ద్విచక్ర వాహనం కొనుగోళ్ల వైపు మొగ్గు చూపటానికి ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త