విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాచవరం మారుతీనగర్ సమీపంలోని ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోన్న నలుగురు నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 16 లక్షల రెండు వేల రూపాయల నగదు... ఒక టీవీ, 19 చరవాణులు, 2 ల్యాప్‌టాప్‌లు, ఓ సెల్‌ఫోన్ కనెక్టర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం 20 మందికి ప్రమేయం ఉన్నట్లు తేలిందనీ... అందులో నలుగురిని అరెస్టు చేశామని.. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
తెలుగు రాష్ట్రాల పరిధిలోనూ ఈ బెట్టింగ్ సాగుతోందని... వీటి మూలాలు ముంబయి వరకు ఉన్నాయా..? అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. బెట్టింగ్ వ్యసనంలో ఎక్కువగా యువత భాగస్వాములవడం ఆందోళన కలిగించే అంశం. అసాంఘిక కార్యకలాపాలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచామనీ.. దానిద్వారానే బెట్టింగ్ సమాచారం తమ దృష్టికి వచ్చిందని వివరించారు పోలీసులు.
అరెస్టు చేసిన నలుగురు నిందితుల్లో ముగ్గురు విజయవాడ వాసులు. మరొకరిది పశ్చిమగోదావరి జిల్లా కైకారం. ప్రధాన నిందితుడు పైలా ప్రసాద్ తన స్నేహితుడైన సిరిబత్తుల కళ్యాణ్ చక్రవర్తి ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని సీపీ తెలిపారు. మారుతీనగర్ మసీదువీధిలోని ఒక ఇంటిని అద్దెకు తీసుకొని... బుకీలుగా ఉండి ఫోన్ ద్వారా బెట్టింగ్ జరుపుతున్నారు. నిందితులపై గేమింగ్ చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు.
ఇవీ చదవండి..
చదువు చాటున గంజాయ్... సరఫరా, వినియోగంలో విద్యార్థులు ముందు!