విద్యారంగంలో సంస్కరణల పేరుతో ప్రపంచ బ్యాంకుతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. ప్రపంచ బ్యాంకు విద్యారంగంలో మార్పులు చేయాలనుకుంటోందని... అందుకు రాష్ట్రాన్ని ప్రయోగశాలగా మార్చాలనుకోవటంపై ఆయన మండిపడ్డారు. ప్రాథమిక పాఠశాలలు లేకుండా విద్యావ్యవస్థను మార్పు చేయాలనుకోవటం దారుణమన్నారు. దీనివల్ల చాలా మంది విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో అక్షరాస్యత తక్కువగా ఉందని... ఇటువంటి సమయంలో ప్రాథమిక పాఠశాలలను రద్దు చేయటం సరి కాదన్నారు. దీనివల్ల ఉపాధ్యాయులు ఉద్యోగాలపై కూడా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.
ప్రపంచ బ్యాంకుతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకునే వరకు పోరాడతామని హెచ్చరించారు. ఉపాధ్యాయులు, ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని కోరుకునే వారితో కలిసి ఉద్యమిస్తామని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించే వరకు ప్రాజెక్టు పనులు ఆపాలన్నారు. పునరావాసం పరిహారం కోసం కావాల్సిన నిధులన్నింటినీ కేంద్రం ఒకేసారి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జూలై నుండి డిసెంబర్ వరకు 6 నెలల పాటు ముంపునకు గురయ్యే ప్రతి కుటుంబానికి నెలకు రూ.7,500లు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: Oommen Chandy: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి: ఉమెన్ చాందీ