విజయవాడ సీపీఆర్ హైస్కూల్లో ఉన్న వలస కార్మికుల పునరావాస శిబిరాన్ని సీపీఎం నేత సీహెచ్ బాబూరావు సందర్శించారు. 40 రోజుల లాక్ డౌన్ అనంతరం కూడా వలస కార్మికులను స్వస్థలాలకు పంపలేని దుస్థితిలో ప్రభుత్వాలున్నాయన్నారు. ఇప్పటి వరకు వలస కార్మికుల పేర్లు కూడా నమోదు పూర్తికాక పోవడం శోచనీయమని పేర్కొన్నారు.
వలస కూలీల ఫిర్యాదులపై స్పందించే నాధుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేదని.... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేదని విమర్శించారు. పీఎం కేర్, ముఖ్యమంత్రి సహాయనిధిలో డబ్బులు ఉన్నా వలస కూలీల దగ్గర ప్రయాణ ఛార్జీలు వసూలు చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
పునరావాస శిబిరాల్లో టీ కూడా ఇవ్వట్లేదు..
ఇతర రాష్ట్రాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పౌరులను రాష్ట్రంలోకి రావడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్యం అమ్మకాల కొరకు వివిధ శాఖల ఉద్యోగులను కేటాయించిన ప్రభుత్వం... వలస కూలీల స్వస్థలాలకు పంపడానికి ఎందుకు బాధ్యత వహించదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యం లభిస్తున్నా.. పునరావాస శిబిరాల్లో టీ కూడా సరఫరా చేయడం లేదని మండిపడ్డారు.
ఇవీ చదవండి...