డాక్టర్ సుధాకర్ విషయంలో పోలీసులు సంయమనంతోనే వ్యవహరించారని కమిషనర్ ఆర్కే మీనా వెల్లడించారు. చట్టం ప్రభుత్వ ఉద్యోగులకు, సామాన్య ప్రజలకు వేరుగా ఉండదని చెప్పారు. నియంత్రణలేని స్థితిలో ఉన్న సుధాకర్‌ను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని సీపీ స్పష్టం చేశారు. ఆ సమయంలో పోలీసుల తీరుపై విచారణ జరుగుపుతున్నామని చెప్పారు.
ప్రజల నుంచి డయల్ 100కు వచ్చిన ఫిర్యాదుతో తమ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని కమిషనర్ తెలిపారు. అక్కడ గొడవ చేస్తున్న వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడని అక్కడికి వెళ్లిన పోలీసులకు తెలియదన్నారు. సుమారు 40 నిమిషాల సమయం పోలీసులు సుధాకర్‌ను అదుపు చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నించారని చెప్పారు. తాము విడుదల చేసిన వీడియోలను పరిశీలించినట్లైతే వాస్తవాలు అర్థం అవుతాయన్నారు. ఈ ఘటన వెనుక ముందస్తు వ్యూహాలు ఉన్నట్లు వస్తున్న వార్తలను సీపీ ఖండించారు.
డాక్టర్ సుధాకర్ మద్యం మత్తులో ఉండడాన్ని గమనించి ఆసుపత్రికి తరలించినట్లు సీపీ తెలిపారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం సహా కానిస్టేబుల్ సెల్ ఫోన్‌ను ధ్వంసం చేసిన ఘటనలపై కేసులు నమోదు చేశామన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం, లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించడం వంటి విషయాలపై కేసులు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.
ప్రస్తుత ఘటనకు గతంలో తలెత్తిన వివాదానికి ఎలాంటి సంబంధం లేదని సీపీ స్పష్టం చేశారు. మద్యం మత్తులో గందరగోళం సృష్టిస్తున్న వ్యక్తిని అదుపు చేయాలనే ఉద్దేశంతో మాత్రమే పోలీసులు వ్యవహరించారని చెప్పారు.