రాష్ట్రంలోని జనాభాలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దాదాపు 70 లక్షల కుటుంబాలకు వ్యవసాయరంగం ఉపాధి కల్పిస్తుంటే.. దీనికి అనుబంధంగా ఉండే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలపై మరో 10 లక్షల మంది ఆధారపడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 500కు పైగా ఉన్న యూనిట్లలో ఏటా 40 వేల కోట్ల రూపాయల వరకూ ఉత్పత్తి జరుగుతుంది. వాటిలో 20 వేల కోట్ల రూపాయల ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతవుతుంటాయి. అయితే కరోనా ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని మరింత దెబ్బతీసింది.
ముడిసరుకు లేక ముందుకెళ్లని పరిశ్రమలు
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రెండు విధానాలుంటాయి. నిల్వచేసుకునే ఆహార పదార్థాల తయారీది ప్రధాన రంగమైతే... తక్కువ కాలం నిల్వ ఉండే ఆహార పదార్థాల తయారీది అనుబంధ రంగం. పంట ఉత్పత్తులు ఎక్కువగా లభించే ప్రాంతాల్లోనే ఈ తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటారు. లాక్‌డౌన్ నుంచి ఈ రంగానికి వెసులుబాటు ఇచ్చినా ఎక్కడా 30 శాతానికి మించి కార్మికులు అందుబాటులో లేకపోవటం, ముడి పదార్థాల సమస్య వల్ల ఎవరూ పరిశ్రమలు తెరవని పరిస్థితి ఏర్పడింది. కష్ట కాలంలో ప్రభుత్వం సహకరిస్తే కొద్దిగానైనా కోలుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మామిడిపై పన్ను విధిస్తున్న గల్ఫ్ దేశాలు...
మామిడి, జామ లభించే సీజన్‌లో ఆ యూనిట్లకు విదేశీ ఆర్డర్లు ఎక్కువ. సరిగ్గా మామిడి సీజన్‌లోనే కరోనా కాటు పడటంతో అనుబంధ పరిశ్రమలన్నింటిపైనా తీవ్ర ప్రభావం పడింది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఎగుమతయ్యే మామిడిపండ్లపై గల్ఫ్ దేశాలు చక్కెర పన్ను విధించాయి. ఎంత మొత్తం ఉత్పత్తి జరుగుతుందో అంత మొత్తం స్థానికంగా పన్ను చెల్లించాలనే నిబంధన రావటంతో ఎగుమతులపైనా ప్రభావం పడింది. కృష్ణా - చిత్తూరు జిల్లాల్లోనే దాదాపు 50 వరకూ ఉన్న యూనిట్లపై రైతులతో పాటు రైతు కూలీలు, ఉపాధి కార్మికులు, డ్రైవర్లు ఇలా లక్షమందిపైనే ఆధారపడి జీవిస్తుంటారు. ఇప్పుడు అన్ని విధాలా నష్టపోయామని పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
లాక్‌డౌన్ నిబంధనలు సడలించి ఊరటనిచ్చామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.... క్షేత్రస్థాయిలో మాత్రం ఉత్పత్తి ప్రారంభమయ్యే వాతావరణం లేదని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
ఇవీ చదవండి...