విజయవాడ కేదారేశ్వరిపేట మార్కెట్ నుంచి ఉత్తరాంధ్ర, ఇతర రాష్ట్రాలకు పండ్లు రవాణా అవుతుంటాయి. ఏటా కోట్లలో జరిగే వ్యాపారం.. కరోనా రెండో దశ వల్ల మూలన పడింది. కర్ఫ్యూ నిబంధనల వల్ల కొనుగోలుదారుల తాకిడి తగ్గిపోయింది. కేసుల ఉద్ధృతి మరికొన్నాళ్లు తప్పదన్న సంకేతాలతో... వ్యాపారులు మరింత ఆందోళన చెందుతున్నారు. రైతుల చేతికి పంట వచ్చినా.. ప్రస్తుతం అమ్ముకునే పరిస్థితుల్లేవు. మంచి ధర లభిస్తుందనే నమ్మకంతో.. పొరుగు రాష్ట్రాల నుంచి విజయవాడకు సాధారణంగా పండ్ల దిగుబడులు ఎక్కువ వస్తాయి. ఈసారి కరోనా కారణంగా ఆ వీల్లేకపోవటంతో.. రైతులంతా స్థానికంగా విక్రయించుకునేందుకే మొగ్గుతున్నారు.
డోర్‌డెలివరీ చేసేలా...
మార్కెట్‌లో పండ్ల ధరలూ పడిపోయాయి. సీజన్ ఆరంభంలో మామిడి టన్నుకు 75వేల దాకా పలకగా.. ప్రస్తుతం 20 వేలకు దిగిపోయింది. గతంలో ఉత్తరాది రాష్ట్రాలకు కేదారేశ్వరిపేట, నున్న మార్కెట్ల నుంచి 3వేల టన్నుల సరకు ఎగుమతయ్యేది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో డిమాండ్ లేక.. 300 టన్నులకే పరిమితమైంది. కరోనా తొలిదశలో ఉద్యాన, మార్కెట్ శాఖల ద్వారా మామిడి సహా ఇతర పండ్లను కాలనీలు, అపార్ట్‌మెంట్ల వద్దకు నేరుగా రవాణా చేసేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడూ అలాంటి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: స్పీడ్ పెట్రోల్ నూటొక్క రూపాయ్...