రాష్ట్రంలో 97 వేల సూక్ష్మ, చిన్న, మధ్య, చిన్న తరహా పరిశ్రమలున్నాయి. దాదాపు 12 లక్షల మంది కార్మికులు ఈ రంగంపై ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఆధారపడి ఉన్నారు. అదే రీతిలో రాష్ట్రంలో 3లక్షల వరకూ లారీలు ఉంటే వీటిపైన మరో 10లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఈ లారీల్లో నిత్యవసరాలు, ఇతర రవాణాకు వెళ్లేవి 8 నుంచి 10 శాతం లోపే. మిగిలిన 90 శాతం పైగా లారీలు పరిశ్రమల మీద ఆధారపడినవే.
సమస్యల సుడిగుండం
కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్ ఈ రెండు రంగాలను తీవ్రంగా కుదేలు చేసింది. లాక్డౌన్ నిబంధనల నుంచి సడలింపులు వచ్చినా పరిశ్రమల్లో ఉత్పత్తి ఆశాజనకంగా లేదు. ముడిసరకు లేక కొన్ని, మార్కెట్ లేక మరికొన్ని, కూలీల ఇబ్బందులతో ఇంకొన్ని ఇలా ఒక్కోటి ఒక్కో సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒక పరిశ్రమపై ఆధాపడి మరో పరిశ్రమ పనిచేయాల్సి ఉండటంతో అన్నీ నష్టాలనే ఎదుర్కొంటున్నాయి. పెరిగిన రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులకు ఇతర సమస్యలు తోడై సప్లై చైన్ మేనేజ్మెంట్ పూర్తిగా దెబ్బతింది.
30 శాతం పరిశ్రమల్లోనే ఉత్పత్తి
ఆర్డర్లు ఉన్నా... మార్కెట్ ఆశాజనకంగా లేదు. ఏడాదిలో ఏ వ్యాపారానికైనా కలిసొచ్చే సీజన్ మార్కెట్ పూర్తిగా దెబ్బతిని ఉంది. నెలతిరిగే సరికి బ్యాంకుకు రుణాలు చెల్లించాల్సిందే. భవనాల అద్దె, ఇతరత్రా ఖర్చులు లక్షల్లోనే ఉంటున్నాయి. ప్రభుత్వపరంగా కొన్ని వెసులుబాటులు వచ్చినా అవి ఎంతమాత్రం నష్టాలను పూడ్చలేకపోతున్నాయి. అరకొర సిబ్బందితో 30శాతం పరిశ్రమలు మాత్రమే ఉత్పత్తి ప్రారంభించాయి.
ఎలాగోలా ఉత్పత్తి ప్రారంభించినా మార్కెటింగ్ పరిస్థితులు అనుకూలించక వ్యాపారం మందకొడిగా సాగుతోంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా లారీలు రోడ్డెక్కక.. రవాణా అనుకూలంగా ఉండడంలేదు. మార్కెట్ అనుకూలించక ఉత్పత్తి తగ్గించినవారు కొందరైతే.. కరోనా కారణంగా ప్రజల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని పరిశ్రమలు ఉత్పత్తి తగ్గించాయి. ఇదిలానే కొనసాగితే పరిశ్రమలు మూసివేయాల్సి వస్తుందని యజమానులు అంటున్నారు.
అప్పుడు 3 షిప్టులు.. ఇప్పుడు ఒకటి
మూడు నెలల తర్వాత తెరుచుకున్న పరిశ్రమల్లోని యంత్రాలను తిరిగి రన్నింగ్ కండిషన్లోకి తీసుకురావాలంటే పారిశ్రామికవేత్తలకు తలకు మించిన భారంగా మారింది. ఎక్కువకాలం వాడకపోవడం వల్ల అవి మరమ్మతులకు గురయ్యాయి. దానికితోడు వాటి స్పేర్ పార్టులు ఇతర రాష్ట్రాలనుంచి తీసుకురావాల్సి రావడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటికితోడు కార్మికుల సమస్య ఒకటి. గతంలో 3-4 షిప్టుల్లో పనిచేసేవారు నేడు ఒక షిప్టులోనే పనిచేస్తున్నారు.
కరోనా కష్టాలు
కరోనా కాటుకు ముందే గత 7-8నెలలుగా ఆర్థికమాంద్యం ఇబ్బందులతో సతమతమవుతున్న పారిశ్రామిక రంగం తాజా పరిస్థితులతో పూర్తిగా కుదేలయ్యే ప్రమాదంలో పడింది. ప్రభుత్వం నుంచి పరిశ్రమలకు రావాల్సిన ప్రోత్సాహకాలు సకాలంలో రాకపోవటం, పలు పరిశ్రమలు ఓవర్ డ్రాఫ్ట్ ఇతరత్రా ఇబ్బందుల్లోకి వెళ్లటం వంటి పరిణామాలకు కరోనా కష్టాలు తోడయ్యాయి. దీంతో రాష్ట్రంలో 80శాతం ఉత్పత్తి ఆగిపోయింది. నిత్యావసరాలకు సంబంధించి 20 శాతం ఉత్పత్తి జరుగుతున్నా.. దానికీ రవాణా, లేబర్ సమస్య వంటివి ఉన్నాయి. ప్రభుత్వాలు వడ్డీ రాయితీపై దృష్టి పెట్టటంతోపాటు.. పరిశ్రమలను ఆదుకునేందుకు 6 నెలల వరకూ వివిధ అంశాలకు వెసులుబాటు కల్పిస్తే ప్రయోజనకరమని అభిప్రాయపడుతున్నారు.
రవాణాకు కష్టం
కిస్తీలు కట్టేలేక, టోల్ ఫీజులు భరించలేక, పెరుగుతున్న ఇంధన ధరలను తట్టుకోలేక రవాణా రంగం తల్లడిల్లిపోతోంది. చాలామంది లారీ యజమానులు ఫైనాన్స్‌పై ఆధారపడి లారీలను కొనుగోలు చేశారు. నెల తిరిగేసరికి కుటుంబ పోషణ, లారీల మెయింటెనెన్స్ చూస్తూనే.. తిన్నా, తినకపోయినా బ్యాంకులకు, ఫైనాన్స్ కంపెనీలకు కిస్తీలు కట్టాల్సిందే. ఈఎంఐల చెల్లింపులో ప్రభుత్వాలు ఇచ్చిన వెసులుబాటు ఎక్కడా అమలుకావట్లేదు. రవాణా రంగంపై ఆధారపడిన డ్రైవర్లు, క్లీనర్లు వీధిన పడ్డారు. పారిశ్రామిక రంగం పుంజుకోగలిగితేనే తాము తిరిగి కోలుకోగలమని లారీ ఓనర్లు అంచనా వేస్తున్నారు.
కూలీలు లేక కుదేలు
పరిశ్రమలు-రవాణా రంగాన్ని వేధిస్తున్న మరో సమస్య హమాలీలది. తయారైన ఉత్పత్తి లారీల్లో లోడ్ చేయాలన్నా.. గమ్యం చేరాక దానిని దించాలన్నా హమాలీలది కీలక పాత్ర. వీరిలో ఎక్కువ శాతం వలసకూలీలే కావటంతో చాలామంది స్వస్థలాలకు వెళ్లిపోయారు. తిరిగి ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి. ఉన్న కొద్దిమంది కరోనా భయంతో రావట్లేదు. వచ్చినా అధికమొత్తం డిమాండ్ చేస్తుండటం రెండు రంగాలకు పెద్ద సమస్యగా మారింది. అలాగే ఈ రంగాలపై ఆధారపడిన డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్ లు, టైరుల్లో గాలికొట్టేవారు, టింకరింగ్ ఇలా మరో 40వరకూ అనుబంధ రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వాహనాలు కదిలితేనే వారికీ జీవనోపాధి దక్కుతుంది.
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రంగాలకు ప్రత్యక్ష రాయితీలు, ఆర్థిక వెసులుబాటు కల్పిస్తేనే తిరిగి గట్టెక్కగలమని యజమానులు స్పష్టం చేస్తున్నారు.
ఇవీ చదవండి:
రుషికొండకు 'బ్లూ ఫ్లాగ్'తో విశాఖ అంతర్జాతీయంగా మెరుస్తుందా!