తెలంగాణలోని భాగ్య నగరంలో దిల్లీ ప్రకంపనలు వ్యాపిస్తున్నాయి. గ్రేటర్ వ్యాప్తంగా దాదాపు 603 మంది దిల్లీలో ఆధ్యాత్మిక సభలకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వివిధ ప్రాంతాల నుంచి మంగళవారం రాత్రి పొద్దుపోయేసరికి 250 మందిని గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వారిని పరీక్షించగా, 117 మందికి కరోనా అనుమానిత లక్షణాలు కనిపించాయని గాంధీ ఆసుపత్రి వైద్య వర్గాలు తెలిపాయి. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో అనుమానిత లక్షణాలున్న వారు 74 మంది అని గ్రేటర్ అధికారులు ప్రకటించారు. 117 మందిలో మిగిలిన 43 మంది చుట్టుపక్కల జిల్లాల వారని సమాచారం. అనుమానితులందరినీ ఐసోలేషన్ వార్డుకు తరలించి ఎక్స్‌రేలు తీయించారు. నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. మిగిలిన వారికి జాగ్రత్తలు చెప్పి, 14 రోజుల పాటు ఇంట్లోనే స్వీయ నిర్బంధం (హోం క్వారంటైన్)లో ఉండాలని సూచించి పంపేశారు. గాంధీ ఆసుపత్రికి రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో సికింద్రాబాద్ నుంచి బోయిగూడ వై.జంక్షన్ దారిని పూర్తిగా మూసివేశారు. బాధితులను మినహా ఎవరినీ అనుమతించడం లేదు.
నగరంలో 463 మంది ఇళ్లకు ప్రత్యేక బృందాలు
దిల్లీ వెళ్లి వచ్చిన వారి కోసం జీహెచ్‌ఎంసీ, పోలీస్, రెవెన్యూ, వైద్యాధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచే వెదుకులాట ప్రారంభించారు. చిరునామాలు సేకరించిన అనంతరం ప్రత్యేక బృందాలు వారి ఇళ్లకు చేరుకున్నాయి. వైద్యులు వారిని పరీక్షించి కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న 74 మందిని ఆసుపత్రికి తరలించారు. 348 మందిని వారి ఇళ్లల్లోనే స్వీయ నిర్బంధంలో ఉంచారు. మరో 41 మందిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. ప్రత్యేక బృందాల సభ్యులు మంగళవారం 463 మంది ఇళ్లకు వెళ్లినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కొందరి చిరునామాలు సక్రమంగా లేకపోవడం వల్ల ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
గుర్తించడంలో కష్టాలు
దిల్లీ-నిజాముద్దీన్ నుంచి తిరిగి వచ్చిన వారిని గుర్తించడం అధికారులు, సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. చాలామందికి ఫోన్ చేసినా స్పందించడం లేదు. ఉదాహరణకు గోల్కొండ ప్రాంతం నుంచి 11 మంది నిజాముద్దీన్ వెళ్లినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. తీరా అక్కడికి వెళ్తే ముగ్గురిని మాత్రమే అధికారులు గుర్తించగలిగారు. మిగతా వారి ఆచూకీ దొరకలేదు. ఇతర ప్రాంతాల్లోనూ ఇదే స్థితి. ఈ పరిస్థితి ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారి కుటుంబాలు కూడా వైరస్ బారిన పడే అవకాశం ఉన్నందున నిజాముద్దీన్ సభలకు వెళ్లి వచ్చిన వారంతా స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. అందరికీ చికిత్సలు అందిస్తామని, ఇబ్బంది ఉండదని భరోసా ఇస్తున్నారు.
ఆచూకీ కోసం రైల్వే తోడ్పాటు!
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి దిల్లీలో ఆధ్యాత్మిక సభలకు హాజరై వచ్చిన వారిని గుర్తించడానికి రెండు తెలుగు రాష్ట్రాలు రైల్వే శాఖ సహాయం తీసుకుంటున్నాయి. మార్చి 14 నుంచి 18 వరకు దిల్లీ నుంచి వివిధ రైళ్లలో తమ రాష్ట్రంలోని రైల్వేస్టేషన్లలో దిగిన ప్రయాణికుల వివరాలు కావాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నతాధికారులు ద.మ.రైల్వేకు లేఖలు రాశారు. ఆ మేరకు రైల్వే అధికారులు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికుల వివరాలు, సెల్‌ఫోన్ నంబర్లు ఇచ్చారు. దిల్లీ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, సంపర్క్ క్రాంతి, హైదరాబాద్ నిజాముద్దీన్ దురంతో ఎక్స్‌ప్రెస్, రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు, ఏపీ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరికొన్ని రైళ్లల్లో ప్రయాణించిన వారి వివరాల ఆధారంగా రెండు రాష్ట్రాల్లో ఆయా వ్యక్తుల కోసం అన్వేషణ మొదలైంది. తెలంగాణ ప్రాంతాలకు వచ్చిన వారందరికీ బుధవారానికల్లా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఇక్కడి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనాపై పోరుకు రామోజీరావు రూ.20 కోట్ల విరాళం