రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని.. ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. ఆంగ్లేయులు కూడా ఇంత నిరంకుశంగా పాలించలేదని..... అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టుపై స్పందించిన ఆయన... దాడి జరిగిన వ్యక్తిపైనే కేసు పెట్టడాన్ని ఖండించారు. రాష్ట్రంలో అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్.., సంక్షోభంలో సంక్షేమంలా పాలన సాగుతోందని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.
జగనన్న విద్య దీవెన.. పాత పథకానికి కోతలు పెట్టి పేరు మార్చారని తులసి రెడ్డి అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77తో ప్రైవేట్ కళాశాలల్లో పీజీ చదివే విద్యార్థులు విద్య దీవెన పథకాన్ని కోల్పోతున్నారన్నారని విచారం వ్యక్తం చేశారు. తక్షణమే జీవో 77 రద్దు చేసి విద్య దీవెన పధకాన్ని అందరికి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి..
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని నమ్మించి.. వారి ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా మాట తప్పిందని తులసి రెడ్డి విమర్శించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని తులసిరెడ్డి సందర్శించి బాధితులకు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రజల పేరు చెప్పి అప్పులు చేస్తున్న వైకాపా ప్రభుత్వం.. తెచ్చిన నిధుల్లో అగ్రిగోల్డ్ బాధితుల వాటా వారికి ఇచ్చినా న్యాయం జరిగేదని అన్నారు. తక్షణమే బాధితులకు న్యాయం చేయాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: