Congress leader Sunkara Padmasri: అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠకు పోకుండా హైకోర్టు తీర్పును అమలు చేయాలని కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ కోరారు. అమరావతి రాజధాని అంశంపై ఏపీ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఆమె తెలిపారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని జగన్ కంకణం కట్టుకున్నారని.. అందుకే మూడు రాజధానుల నాటకానికి తెరతీశారని పద్మశ్రీ మండిపడ్డారు.
High Court Verdict on Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మూడు ప్రధానాంగాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ శాసనం చేసే అధికారం శాసనసభకు లేదని త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది. సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్ 58కి లోబడి అమరావతి రాజధాని నగరం, ఆ ప్రాంతంలో రహదారులు, తాగునీరు, డ్రైనేజి, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను నెల రోజుల్లో కల్పించాలని ఆదేశించింది. సెక్షన్ 61 ప్రకారం రాజధానిలోని టౌన్ ప్లానింగ్ స్కీమ్ (నవ నగరాలు) పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందే...
రాజధాని కోసం భూములిచ్చిన యజమానులు, రైతులకు మౌలిక సదుపాయాలన్నీ కల్పించి, నివాసయోగ్యంగా ప్లాట్లను సిద్ధం చేసి మూడు నెలల్లోగా అప్పగించాలని నిర్దేశించింది. భూసమీకరణలో భాగంగా రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో అమరావతి రాజధాని నగరాన్ని నిర్మించాలని, రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తేల్చిచెప్పింది. రాజధాని కోసం సమీకరించిన భూములను రాజధాని నగర నిర్మాణం, రాజధాని ప్రాంత అభివృద్ధికి తప్ప.. తాకట్టు పెట్టడానికి, వాటిపై మూడో వ్యక్తి (థర్డ్ పార్టీ)కి హక్కులు కల్పించొద్దని స్పష్టం చేసింది. అమరావతిలో అభివృద్ధి పనులపై పురోగతిని తెలియజేస్తూ ప్రత్యేకంగా అఫిడవిట్లు దాఖలు చేయాలని స్పష్టంగా నిర్దేశించింది. వీటన్నింటిపైనా రాష్ట్ర ప్రభుత్వానికి, సీఆర్‌డీఏకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక సమస్యలను కారణాలుగా చూపుతూ అమరావతిలో నిర్మాణాలు చేపట్టలేమంటే కుదరదని కుండబద్దలు కొట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. మరోవైపు రాజధానిలోని కార్యాలయాల తరలింపును నిలువరిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు.. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు అమల్లోనే ఉంటాయని స్పష్టం చేసింది. సీఆర్‌డీఏ రద్దు, మూడు రాజధానుల చట్టాలను సవాలు చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు, ఎస్.మురళీధర్‌రెడ్డి, మండల రమేశ్, గిరిబాబు తదితరులకు 17 వాజ్యాల్లో ఒక్కోదానికి రూ.50 వేల చొప్పున మొత్తం 8.5 లక్షలు ఖర్చులు కింద చెల్లించాలని ఆదేశించింది. రాజధాని బృహత్తర ప్రణాళికను సీర్‌డీఏ, రాష్ట్ర ప్రభుత్వం సుమోటోగా సవరించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. జీఎన్‌రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్, ఉన్నతస్థాయి కమిటీలు ఇచ్చిన నివేదికలను తగిన సమయంలో పిటిషనర్లు సవాలు చేసుకోవడానికి స్వేచ్ఛనిచ్చింది. అమరావతి నుంచి రాజధాని తరలిస్తూ శాసనం చేసే అధికారం ప్రభుత్వానికి లేదంటూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణను పెండింగ్‌లోనే ఉంచింది.
29,754 మంది రైతులు భూసమీకరణలో 33,771 ఎకరాల భూమిని రాజధాని కోసం ఇచ్చారు. వీరిలో 93శాతం మంది చిన్న, సన్నకారు రైతులు. వారి జీవనాధారం దెబ్బతింటున్నప్పుడు కోర్టు మౌనసాక్షిగా ఉండాలా? అధికారాన్ని ఉపయోగించాలా? రైతులు హుందాతనంగా జీవించే హక్కును ప్రభుత్వం లాగేసుకుంది. - హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం
ఇదీ చదవండి:
CPI Ramakrishna: 'పెళ్లైనా ఆరు నెలల తర్వాత శుభలేఖ ప్రచురించినట్లు..'