Probation: రెండేళ్ల సర్వీసు పూర్తి చేసిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఖరారు చేసే అధికారాన్ని కలెక్టర్లు, కొన్ని శాఖల జిల్లా విభాగాధిపతులకు ప్రభుత్వం అప్పగించనుంది. మంగళవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వారం, పది రోజుల్లో ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది. శాఖాపరంగా పరీక్షల్లో ఉత్తీర్ణులుకాని వారిలో ఎవరైనా రాబోయే రోజుల్లో పాసైతే వారి ప్రొబేషన్‌నూ కలెక్టర్లే ఖరారు చేయనున్నారు.
సచివాలయాల్లో పని చేస్తున్న దాదాపు 1.21 లక్షల మంది ఉద్యోగుల్లో రెండేళ్ల సర్వీసు పూర్తయినవారి ప్రొబేషన్‌ను జూన్ నెలాఖరులోగా ఖరారు చేసి జులై నుంచి కొత్త స్కేల్ ప్రకారం వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా సమాచారం ప్రకారం దాదాపు 73వేల మంది రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైనట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఇటీవల ఉత్తీర్ణులైన సుమారు 13వేల మంది ఏఎన్‌ఎంలు, రెండోసారి పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన మరో 5వేల మంది ఉద్యోగులు ఉన్నారు. 13వేల మంది మహిళా పోలీసులకు సంబంధించిన పరీక్ష ఫలితాలు వెలువడాల్సి ఉంది. శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులై, రెండేళ్లలో ఎలాంటి పోలీసు కేసులు, అభియోగాలు, ఫిర్యాదులు లేని ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు కోసం అధికారులు జిల్లాల వారీగా జాబితాలను కలెక్టర్లకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.
వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల ప్రొబేషన్‌ను పురపాలకశాఖ ప్రాంతీయ సంచాలకులు (ఆర్డీఎంఏ) ఖరారు చేయనున్నారు. ఎనర్జీ అసిస్టెంట్లను విద్యుత్తు పంపిణీ సంస్థల సీఎండీలు, వ్యవసాయ అసిస్టెంట్లను జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు, సర్వేయర్లను జిల్లా సర్వే సహాయ సంచాలకులు, ఏఎన్‌ఎంల ప్రొబేషన్‌ను వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకులు ఖరారు చేసేలా ఉత్తర్వులివ్వనున్నారని తెలుస్తోంది. మిగతా ఉద్యోగుల ప్రొబేషన్‌ను కలెక్టర్లు ఖరారు చేస్తారు.
ఇవీ చూడండి: